చికిత్స పొందుతూ బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ బాలిక మృతి

Aug 1 2025 12:13 PM | Updated on Aug 1 2025 12:13 PM

చికిత్స పొందుతూ  బాలిక మృతి

చికిత్స పొందుతూ బాలిక మృతి

శంకరపట్నం: మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన ఆయేషా(3) హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన ఎండీ గౌస్‌ భార్య కరిష్మా, పిల్లలు మహేక్‌, తాజ్‌బాబా, అయేషాతో కరీంపేటలో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం గౌస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు భారం కరిష్మాపై పడింది. ఆయేషా గుండెకు రంధ్రం ఉండడంతో కరీంనగర్‌లో వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయింది.

అనారోగ్యంతో గర్భిణి..

జమ్మికుంట: పట్టణానికి చెందిన ఓ గర్భిణి చికిత్స పొందుతూ మృతి చెందింది. టౌన్‌ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. పట్టణంలోని శాలవాడకు చెందిన బంకుల జ్యోతి(33) అనారోగ్యంతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలి తల్లి రాముల లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

రోడ్డు ప్రమాదంలో పీఎంపీ ..

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): సుల్తానాబాద్‌ మండలంలోని భూపతిపూర్‌ గ్రామ శివారులోని కస్తుర్బా విద్యాలయం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన పీఎంపీ శివుపల్లి రవీందర్‌(57) బైక్‌పై ఐతరాజుపల్లిలోని అత్తింటికి వచ్చి అక్కడినుంచి గర్రెపల్లిలో పని నిమిత్తం వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడగా తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు.

పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య

శంకరపట్నం: మండలంలోని మొలంగూర్‌ గ్రామానికి చెందిన గూళ్ల శ్రీకాంత్‌ (25) పెళ్లికావడం లేదని గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మొలంగూర్‌ గ్రామానికి చెందిన గూళ్ల శ్రీకాంత్‌ తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. కొద్దిరోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కుదరకపోడంతో మనస్తాపం చెందాడు. బుధవారం తమ వ్యవసాయపొలం వద్ద గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. శ్రీకాంత్‌ తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

హుండీ దొంగతనం కేసులో మూడేళ్ల జైలు

ధర్మపురి: నేరెళ్ల సాంబశివ ఆలయంలో మార్చి 4న జరిగిన హుండీ దొంగతనం, సీసీ కెమెరాల ధ్వంసం కేసులో నిందితుడైన ఉబ్బిడి శేఖర్‌కు మూడేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి యోగి జానకి గురువారం తీర్పునిచ్చారు. దొంగతనం జరిగిన అనంతరం ఎస్సై ఉదయ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించగా పరిశీలించిన జడ్జి శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు.

ఆర్‌ఎంపీ ఇంట్లో చోరీ

రాయికల్‌: రాయికల్‌కు చెందిన ఆర్‌ఎంపీ మోర శంకర్‌ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.4లక్షల నగదు, 3 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడి కథనం ప్రకారం.. శంకర్‌ బుధవారం ఇంటికి తాళాలు వేసి కిష్టంపేటలోని తన బావమరిది ఇంట్లో హల్దీ వేడుకకు వెళ్లాడు. అర్ధరాత్రి తిరిగి రాగా గదులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.4 లక్షలు, మూడు తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి లబోదిబోమన్నాడు. శంకర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్‌టీం, ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరించారు.

విద్యుత్‌ మోటారు..

జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్‌ మండలం తిప్పన్నపేట గ్రామంలోని బోగు లింగన్న వ్యవసాయ పొలం వద్దనున్న విద్యుత్‌ మోటారును బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. కొద్దికాలంగా తిప్పన్నపేట, గోపాల్‌రావుపేట, హైదర్‌పల్లి గ్రామాల్లో విద్యుత్‌ మోటార్లు చోరీకి గురవుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement