
ప్రాణం తీసిన వంద రూపాయల గొడవ
జ్యోతినగర్(రామగుండం): ఊరుగాని ఊరికి వలసవచ్చి కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ కార్మికుడు రూ.వంద గొడవలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి రామగుండం పర్మినెంట్ టౌన్‌షిప్‌లో జరిగింది. వలస కార్మికులు, పోలీసులు తెలిపిన వివరాలు..
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జాట్లాపూర్ గ్రామానికి చెందిన వినోద్ బుబాజి సోన్కరి(44) ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని ఓ కంపెనీకి సంబంధించి బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు చేసుకుంటూ అక్కడే ఓ షెడ్‌లో ఐదుగురితో కలిసి ఉంటున్నాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి తనతో పాటు ఉన్న మనోజ్ అనే వ్యక్తి నీలకంఠ అనే మరో కార్మికుడికి రూ.300 అప్పు ఇచ్చాడు. నీలకంఠ తిరిగి మనోజ్‌కు రూ.200 ఇచ్చి మరో వంద తర్వాత ఇస్తానని చెప్పగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. మనోజ్ మద్యం మత్తులో నీలకంఠపై దాడికి పాల్పడగా అక్కడే ఉన్న వినోద్ ‘గొడవ చేయకండి, బయటకు వెళ్లండి’ అని వారించాడు. తనను బయటకు వెళ్లమని చెప్పిన వినోద్ మాటలకు పగ పెంచుకున్న మనోజ్ అర్ధరాత్రి లేబర్‌షెడ్‌లో నిద్రిస్తున్న వినోద్ తలపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. ఉదయం అందరికీ వంట చేయాల్సిన వినోద్ నిద్ర నుంచి మేల్కోనకపోవడం, తలపై రక్తం ఉండటంతో వెంటనే తోటి కార్మికులు ట్రాక్టర్‌లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మృతిచెందాడని తెలి పారు. వినోద్‌ను హత్య చేసిన నిందితుడితోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటన స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐ రవీందర్, ఎస్సై ఉదయ్‌కిరణ్ పరిశీలించారు. కాగా, మృతుడికి భార్య ప్రతిభ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎన్టీపీసీ పీటీఎస్‌లో వలస కార్మికుడి హత్య

ప్రాణం తీసిన వంద రూపాయల గొడవ