
స్వయం ప్రతిపత్తితోనే సంఘాల పురోగతి
కరీంనగర్ అర్బన్: స్వయం ప్రతిపత్తితోనే సంఘాలు పురోగతి సాధిస్తాయని, తదనుగుణ కార్యాచరణతో సాగాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ డా.సుబ్బారాయుడు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఎన్.లింగారెడ్డి ఆధ్వర్యంలో 18వ సర్వసభ్య సమావేశం గురువారం నగరంలోని ఇందిరా గార్డెన్స్‌లో నిర్వహించారు. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ఆడిట్ నివేదికల సమర్పణ, ఉమ్మడి సంఘం నుండి కొత్త జిల్లాల విభజన తదితర అంశాలు చర్చించారు. సుబ్బారాయుడు మాట్లాడుతూ, సంఘాలు స్వయం సమృద్ధిని సాధించి బలోపేతం కావాలని సూచించారు. జిల్లా పశువైద్యాధికారి సుధాకర్ మాట్లాడుతూ, సంఘాలు సొంత వ్యాపార అవకాశాలను ఏర్పాటుచేసుకుని లబ్ధి పొందాలని అన్నారు. సహకార యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.లింగారెడ్డి మాట్లాడుతూ, సంఘాలు స్వతంత్రంగా, నూతన కార్యక్రమాలు చేపట్టి, వారి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల సంఘాలు ఏర్పాటుకు అన్ని చర్యలు పూర్తి చేశామని అన్నారు. సిరిసిల్ల జిల్లాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, పెద్దపల్లి జిల్లాశాఖ అధికారి శంకర్, ఉప సంచాలకుడు రవికుమార్, అసిస్టెంట్ డైరెక్టర్లు శ్రీధర్, బాలకిషన్, వాణిశ్రీ పాల్గొన్నారు.
రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ బి.సుబ్బారాయుడు