
ఉపాధ్యాయుల ప్రమోషన్లకు పచ్చజెండా
కరీంనగర్: ఉపాధ్యాయుల ప్రమోషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమోషన్ల ప్రక్రియ ఈనెల 2 నుంచి 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది. పదోన్నతుల ప్రక్రియ సజావుగా జరిగేలా విద్యాశాఖ సెక్రటరీ గురువారం సాయంత్రం అన్ని జిల్లాల డీఈవోలతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా మొదటగా గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు రానున్నాయి. మల్టీజోన్– 2లో మిగిలిపోయిన, పదవీ విరమణతో ఖాళీగా ఉన్న గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టులు భర్తీ కానున్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి ఇచ్చి వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. డీఎస్సీ–2012 తర్వాత పీఈటీ, భాష పండితులకు కూడా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. మొత్తంగా జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ గెజిటెడ్ హెచ్‌ఎంలుగా, భాషా పండితులు, ఎస్‌జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందే అవకాశం దక్కింది. జూన్ 30 వరకు ఉన్న ఖాళీలను ఆధారంగా తీసుకుని ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం.
పదోన్నతుల షెడ్యూల్
ఈనెల 2న ఖాళీల వెబ్‌సైట్‌లో ప్రదర్శన. 3న సీనియార్టీ జాబితాపై అభ్యంతరాల సమర్పణ. 4,5న అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా విడుదల. 6న వెబ్ ఆప్షన్ల అమలు (హెడ్మాస్టర్ గ్రేడ్–2 కోసం), 8,9న ఎస్‌జీటీల తుది జాబితా విడుదల, 10న ఎస్‌జీటీలకు వెబ్ ఆప్షన్ల ఆవకాశం, 11న స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతి అర్డర్లు, 12న ఎస్‌జీటీల పదోన్నతి అర్డర్లు(జిల్లా కలెక్టర్ అనుమతితో) మొత్తంగా పది రోజుల్లో పదోన్నతుల ప్రక్రియను ముగించేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఈ నెల 2 నుంచి 12 వరకు పదోన్నతుల ప్రక్రియ