
పెన్షన్ ఇప్పిస్తానని పుస్తెలతాడు చోరీ
ధర్మపురి: ఓ వృద్ధురాలికి పింఛన్ ఇప్పిస్తానని మా యమాటలు చెప్పి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును తీసుకెళ్లిన ఘటన పట్టపగలే చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని నేరెళ్ల గ్రామానికి చెందిన అయ్యోరి పోశవ్వ ధర్మపురి గోదావరిలో స్నానం చేసేందుకు నేరెళ్ల వద్ద గురువారం బస్సు ఎక్కింది. అదే బస్సులో ఉన్న ఓ మోసగాడు ఆమెను అనుసరించాడు. ధర్మపురిలో పోశవ్వ బస్సు దిగి కూరగాయల మార్కెట్ వైపు వెళ్తుండగా.. సదరు వ్యక్తి ‘అవ్వా నీకు పింఛన్ వస్తుందా.. రాకుంటే నేను ఇప్పిస్తా.. నేను నేరెళ్ల గ్రామ కార్యదర్శిని. నీకు పింఛన్ వచ్చేలా చేస్తా..’ అని మాయమాటలు చెబుతూ నందీ కూడలి పక్కనున్న సందిలోకి తీసుకెళ్లాడు. మెడలో ఉన్న పుస్తెలతాడు ఇస్తే.. వేరే మహిళ మెడలో వేసి ఫొటో తీసి ఇస్తానని నమ్మించాడు. దీంతో వృద్ధురాలు ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు తీసి ఇచ్చింది. వెంటనే సదరు మోసగాడు అక్కడి నుంచి జారుకున్నాడు. అరగంటపాటు ఎదురుచూసిన పోశవ్వ మోసపోయాయని గమనించి లబోదిబోమంటూ ఏడ్చింది. జరిగిన సంఘటనను పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.