
ముదిరాజ్‌లకు అధిక సీట్లు ఇవ్వాలి
కరీంనగర్: తెలంగాణలో ముదిరాజ్ జనాభా దామాషా ప్రకారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కేటాయించాలని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంద నగశ్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని కెమిస్ట్రీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ముదిరాజుల జనాభా 14.6 శాతం ఉన్నా.. అధికారాల్లో వారి ప్రాతినిధ్యం శాతం తక్కువుందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ముదిరాజులకు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం విచారకరమని మండిపడ్డారు. ముదిరాజులను బీసీ–డి నుంచి బీసీ–ఏ గ్రూపునకు మారుస్తామని గొప్పగా ప్రకటించినా.. అది మాటలకే పరిమితమైందన్నారు. తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సిద్ధి సంపత్‌కు నియామక పత్రం అందజేశారు. సంపత్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ముదిరాజుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మురళి, పిట్టల మధుసూదన్, నారాయణ, శ్రీని వాస్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.