
నమ్మించి.. గొంతుకోసి
● వృద్ధురాలిపై మహిళ హత్యాయత్నం
● బంగారం, నగదు కోసం ఘాతుకం
సైదాపూర్: ‘నా భర్తతో గొడవ జరిగింది. ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకుంటాను’ అంటూ ఓ వృద్ధురాలిని నమ్మించింది. వృద్ధురాలు నిద్రపోయాక, హత్యాయత్నం చేసింది. ఆపై బంగారం, నగదుతో ఉడాయించిందో మహిళ. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రావుల ప్రమీల(70) ఒంటరిగా ఉంటోంది. పెద్ద కొడుకు రావుల రాజిరెడ్డి కరీంనగర్‌లో, చిన్న కొడుకు దేవేందర్‌రెడ్డి సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన మిట్టపల్లి స్వరూప(50) మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రమీల ఇంటికి తరుచూ వచ్చి మాట్లాడుతోంది. రాత్రి పూట కూడా వచ్చింది. భర్తతో గొడవ జరిగిందని, రాత్రికి మీ ఇంట్లోనే పడుకుంటానని నమ్మబలికింది. ప్రమీల నిద్రపోయిన తర్వాత దిండుతో ముఖంపై అదిమిపట్టింది. కత్తితో గొంతు, శరీరభాగాలపై గాయపరిచింది. చనిపోయిందని అనుకుని వృద్ధురాలిపై ఉన్న బంగారం, నగదుతో పారిపోయింది. బుధవారం వేకువజామున స్పృహ వచ్చిన ప్రమీల చిన్న కొడుకు దేవేందర్‌రెడ్డికి ఫోన్‌చేసి విషయం చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన కొడుకులిద్దరూ వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.