
బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ
● కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి
కరీంనగర్ కార్పొరేషన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల వ్యవహారంతో బీజేపీ బీసీలకు వ్యతిరేకమని మరోసారి రుజువైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం పొందినప్పుడు లేని అభ్యంతరం, కేంద్రం వద్దకు వెళ్లేసరికి బీజేపీకి ఎందుకొస్తుందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తే ముస్లింలకు ప్రయోజనం కలుగుతుందని ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు కాంగ్రెస్ అనుకూలంగా లేదన్నారు. 42శాతం రిజర్వేషన్లలో 10శాతం ముస్లింలే పట్టుకుపోతారంటూ బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలైతే ముస్లింలకు దక్కేది 5.08శాతం మాత్రమేనని, 10శాతం అంటూ ఎలా చెబుతున్నారో బీజేపీ నేతలకే అర్థం కావాలన్నారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్పించి, ఆమోదం పొందేలా కృషి చేయాలన్నారు. సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు ఎండీ.తాజ్, సమద్‌నవాబ్, కోడూరి రవీందర్‌గౌడ్, శ్రవణ్, నరసింగం, దన్నాసింగ్ పాల్గొన్నారు.