
సస్పెన్షన్‌కు ముందే క్యాన్సిల్!
● సర్వే నం. 272/14లో తొమ్మిది డాక్యుమెంట్లు రద్దు ● ఆ వెంటనే అందిన సస్పెన్షన్ ఆర్డర్ ● ఫలించని గంగాధర సబ్‌రిజిస్ట్రార్ వ్యూహం ● 272లో తొమ్మిదిన్నర ఎకరాల మాటేంటి? ● అనర్హులకు పట్టాభిషేకంపై నోరెత్తని ఉన్నతాధికారులు ● రూ.250 కోట్ల భూమి మింగేసేందుకు ప్లాన్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
అవన్నీ లావుణి పట్టాలు.. రెవెన్యూ రికార్డుల ప్రకారం పక్కా ప్రభుత్వ భూములు. వీటిలో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరపరాదు. కానీ, లంచాలకు రుచిమరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మాత్రం ఇష్టానుసారంగా తమ పని తాము చేసుకుంటూ ప్రభుత్వ భూములను తమకు నచ్చినవారికి పట్టాలు చేసుకుంటూ పోతున్నారు. గంగాధర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో వెలుగుచూస్తున్న అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. ఇటీవల కొత్తపల్లి మండలంలోని 175,197,198 సర్వే నంబర్లలో ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన 476 పట్టాలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ విషయం మరువకముందే తాజాగా కొత్తపల్లిలోని సర్వే నంబరు 272/14లో ప్రభుత్వభూమిలో 20 గుంటల్లో అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. కానీ... అప్పటికే ఆలస్యం అయింది. తప్పును గుర్తించిన అధికారులు సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, అప్పటికే సదరు అధికారి ప్రభుత్వ భూమిలో తాను చేసిన డాక్యుమెంట్లను తిరిగి రద్దు చేయడం గమనార్హం
రూ.250 కోట్ల భూమికి స్కెచ్..
కొత్తపల్లి మండలంలో 272 సర్వే నంబరులో మొత్తం 24 ఎకరాల 24 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దాదాపు రూ.250 కోట్లు వరకు మార్కెట్ రేటు ఉంటుంది. పైగా జాతీయ రహదారి 563ను ఆనుకుని ఉండటం ఈ రేటు పలకడానికి కారణం. అందులో తొమ్మిదిన్నర ఎకరాలు కూడా లావుణి పట్టా కిందే ఉంది. అయినా ఈ భూమిని పలువురి పేరు మీదకు సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేశారు. మిగిలిన 15 ఎకరాలు ప్రభుత్వ భూమిగానే రికార్డుల్లో ఉంది. ఈ భూమి కూడా ఎవరి పేరు మీదైనా ఇంటి నంబర్ల పేరిట రిజిస్ట్రేషన్ చేశారన్న అనుమానాలు ఉన్నాయి. పలువురు రాజకీయ నాయకుల అనుచరుల పేరు మీద ఇక్కడ భూములు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రూ.250 కోట్ల భూమిని మింగేసేందుకు ఎవరు ప్రయత్నించారు? దీని వెనక ఉన్న వారెవరు? అన్న విషయంలో అధికారులు లోతుగా విచారణ జరపాల్సి ఉంది.

సస్పెన్షన్‌కు ముందే క్యాన్సిల్!

సస్పెన్షన్‌కు ముందే క్యాన్సిల్!