
సమన్వయంతో సమస్య పరిష్కరించాలి
● ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ, ఆర్‌అండ్‌బీ అధికారులు సమన్వయంతో డ్రైనేజీలు, కల్వర్ట్‌లను అభివృద్ధి చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేకాధికారి సర్ఫరాజ్‌అహ్మద్ అన్నారు. ఇటీవల ముంపునకు గురైన మంచిర్యాల చౌరస్తా, రాంనగర్, ఆర్టీసీ వర్క్‌షాప్ ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వరద నీళ్లు రోడ్లపై నిలవడానికి, ఇళ్లలోకి వెళ్లడానికి కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలు పడుతున్న సమయంలో నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, నీళ్లు నిలిచే ప్రాంతాల్లో తాత్కాలికంగా కచ్చా నాలాల ద్వారా డ్రైనేజీలకు మళ్లించాలన్నారు. కాగా, తరచూ ముంపునకు గురవుతున్న మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్, సాహెత్‌నగర్, సాయినగర్‌లో డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ ప్రత్యేక అధికారిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. నగరపాలక కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజి వాకడే, ఆర్డీవో మహేశ్వర్, ఈఈ యాదగిరి, డీఈ లచ్చిరెడ్డి, ఏసీపీ శ్రీధర్ తదితరులు ఉన్నారు.
ఎరువుల దుకాణాలపై నిఘా పెట్టాలి
గంగాధర(చొప్పదండి): ఎరువులు, విత్తనాల దుకాణాలపై వ్యవసాయశాఖ అధికారులు నిఘా ఉంచి తరుచూ తనిఖీలు నిర్వహించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి సర్ఫరాజ్‌అహ్మద్ ఆదేశించారు. సోమవారం మండలంలోని మధురానగర్ చౌరస్తాలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓపీ, ఐపీ రిజస్టర్లును పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆర్డీవో మహేశ్వర్, డీఏవో మహేశ్వర్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, తహసీల్దార్ అనుపమ, ఎంపీడీవో రాము ఉన్నారు.