
జాతీయ వర్క్‌షాపులో కలెక్టర్ పమేలా సత్పతి
● కరీంనగర్ పారిశుధ్యంపై ప్రసంగం ● వెల్లువెత్తిన ప్రసంశలు
కరీంనగర్ అర్బన్: పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భువనేశ్వర్‌లో నిర్వహించిన రెండురోజుల జాతీయస్థాయి వర్క్‌షాపులో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. పారిశుధ్య పనుల్లో భద్రత, రక్షణ, పారిశుధ్య కార్మికుల గౌరవం పెంచేందుకు ఇతర రాష్ట్రాలు, సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ఈ వర్క్‌షాపులో చర్చించారు. పారిశుధ్య కార్మికుల భద్రతకు కరీంనగర్‌లో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు. కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ప్రత్యేకంగా ఆరోగ్యకార్డులు అందజేశామని, తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు రికార్డు చేశామని తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా కరీంనగర్‌లో పారిశుధ్య కార్మికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, ఒడిశా రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రశంసించారు. అలాగే కరీంనగర్‌లో అనుసరిస్తున్న విధానాలను అన్ని రాష్ట్రాల్లో అనుసరించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.