
ఎరువులు కొంటే బీమా
కరీంనగర్‌రూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోపాటు ప్రైవేట్ డీలర్ల వద్ద ఎరువులు కొన్న రైతులకు కొత్తగా బీమా సౌకర్యం కల్పించారు. ఇఫ్కో ఎరువుల కంపెనీ ఉచిత సంకటహరణ బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఎరువులు కొన్న ప్రతీ రైతుకు ప్రమాద బీమా సౌకర్యం వర్తింపజేస్తారు. ఇటీవల కురిసిన వర్షాలతో వానాకాలం సీజన్ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనుల నిమిత్తం రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈక్రమంలో రైతులు ప్రమాదాల బారిన పడితే కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రైతులు ప్రమాదాల బారిన పడితే కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇఫ్కో ఎరువుల కంపెనీ బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎరువులు కొంటే సరిపోతుంది.
రసీదు భద్రపరుచుకోవాలి
సహకార సంఘాలు, డీలర్ల వద్ద ఇఫ్కో కంపెనీ ఉత్పత్తి చేసిన ఎరువులు కొనుగోలు చేసినపుడు రసీదులను త ప్పనిసరిగా తీసుకుని భద్రపరుచుకోవాలి. రైతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం, నీటిలో మునిగిపోవడం, పాముకాటు, ట్రాక్టర్, హర్వెస్టర్ తదితర యంత్రాలతో ప్రమాదానికి గురైతే బీమా పరిహారం పొందే అవకాశముంది. రసీదుతోపాటు రైతు మృతికి సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైతే ఎఫ్‌ఐఆర్ కాపీ, పోస్ట్‌మార్టం రిపోర్టు, మరణ ధ్రువీకరణ పత్రం ఇఫ్కో కంపెనీ ప్రతినిధులకు రెండునెలల్లోపు సమర్పించాల్సి ఉంటుంది.
రూ.2 లక్షల వరకు..
సహకార సంఘాలతోపాటు ప్రైవేట్ డీలర్ల వద్ద ఇఫ్కో ఎరువులు కొన్న రైతులందరికీ ప్రమాదబీమా సౌకర్యం కల్పించారు. రైతు కొనుగోలు చేసిన ఒక బస్తా, నానో ఎరువు బాటిల్‌పై రూ.10వేల బీమా, 20 బస్తాలు లేదా నానో యూరియా సీసాలు కొనుగోలు చేస్తే రూ.2 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎరువులు కొన్న నెల తర్వాత నుంచి ఏడాది వరకు బీమా సౌకర్యముంటుంది. రైతు మృతిచెందితే వందశాతం, రెండు అవయవాలు కోల్పోతే 50శాతం, ఒక అవయం కోల్పోతే 25శాతం బీమా పరిహారం చెల్లిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద ఇఫ్కో ఎరువులు కొన్న రైతులందరికీ బీమా సౌకర్యముంటుంది. ఎరువులు కొన్న రసీదులను భద్రపరుచుకోవాలి. గతంలో సైతం బీమా సౌకర్యముండగా పరిహారం తక్కువగా ఉండేది. ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి పరిహారం పెంచిన దృష్ట్యా రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– బి.బాలాజీ, ఇఫ్కో కంపెనీ జిల్లా మేనేజర్
ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అమలు
రూ.2లక్షల వరకు ఆర్థికసాయం

ఎరువులు కొంటే బీమా

ఎరువులు కొంటే బీమా