
ముదిగొండ అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం
కరీంనగర్: ముదిగొండ అమరవీరుల స్ఫూర్తితో పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాల కోసం సమరశీల ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక ముకుందలాల్ మిశ్రాభవన్‌లో మాట్లాడారు. ముదిగొండలో పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన చేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై తుపాకీ తూటాల వర్షం కురిపించి ఏడుగురిని కాల్చి చంపిందన్నారు. పాలకులు మారినా పేదల జీవితంలో మార్పు రావడం లేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే ముందు అందరికీ ఇళ్లు ఇస్తామని హామీలను విస్మరించిందని, ఇంటి స్థలం కోసం పోరాటం చేసిన పేదలపై కేసులు పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. ఇప్పటికై నా పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వాసురెడ్డి, సుంకరి సంపత్, భూతం సారంగపాణి, వడ్ల రాజు, కవ్వంపల్లి అజయ్, మాతంగి శంకర్, రాయికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రసాద్