కరీంనగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్షాల గొంతునొక్కే విధంగా వ్యవహరిస్తోందని, ఉపరాష్ట్రపతి విషయంలోనూ పొమ్మనలేక పొగ పెడుతున్నట్లు కనిపిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తోందన్నారు. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పార్లమెంటు సమావేశాలు వాయిదా వేయడం సరికాదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఆర్డినెన్స్ పంపినప్పటికీ, తమ వైఖరి స్పష్టం చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధం కావాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, అశోక్,గూడెం లక్ష్మి, టేకుమల్ల సమ్మ య్య, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.