
డ్రగ్ మాఫియాపై కొరడా
● వేణు ఏజెన్సీపై కేసు.. యజమాని రిమాండ్
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ కేంద్రంగా విచ్చలవిడిగా నడుస్తున్న డ్రగ్ మాఫియాపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అక్రమ ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నకిలీ మందులు అమ్ముతున్న వేణు ఏజెన్సీ ఆథరైజ్డ్ డీలర్‌షిప్‌ను సన్‌ఫార్మా ఇప్పటికే రద్దు చేయగా, డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు సీరియస్‌గా తీసుకొని వేణు ఏజెన్సీ యజమానినిపై కేసుపెట్టారు. కోర్టులో వేణుకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అయితే కరీంనగర్‌కు చెందిన వేణు మెడికల్ ఏజెన్సీస్ పక్షవాతం వచ్చిన పేషెంట్లకు వాడే లివిపిల్–500 అనే మెడిసిన్‌ను ప్రముఖ సన్‌ఫార్మా కంపెనీ తయారు చేస్తుండగా, ఆ కంపెనీ నుంచి డీలర్‌షిప్ హక్కును పొందింది. కొంతకాలంగా వేణు ఏజెన్సీ నిర్వాహకులు అక్రమ సంపాదన కోసం అధికారుల కళ్లుగప్పి ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ మందులను తీసుకొచ్చి రిటైల్ వ్యాపారులకు ఇస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడడం, ఈ మందులను సన్‌ఫార్మా నకిలీవిగా గుర్తించడంతో అధికార యంత్రాంగం కదిలింది. నకిలీ మందులను బీహార్ నుంచి తెప్పించినట్లు విచారణలో తేటతెల్లమైంది. ఈ విషయం బయటపడిన నాటి నుంచి వేణు ఏజెన్సీ యజమాని పరారీలో ఉండగా, శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపర్చారు.
నకిలీకి అడ్డుకట్ట పడేనా..?
కరీంనగర్ కేంద్రంగా విచ్చలవిడిగా కొనసాగుతున్న నకిలీ మందుల దందా పూర్తిగా కమీషన్ల మీదే నడుస్తోంది. అడ్డగోలుగా కమీషన్లకు అలవాటు పడిన మందుల మాఫియా అసలును పోలిన నకిలీ మందులతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నారు. ఈ మందులు వాడిన పేషెంట్ల రోగాలు తగ్గడం దేవుడెరుగు.. ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారు. ఇలాంటి మందులు అన్ని బ్రాండ్లలోకి విస్తరించినట్లు తెలుస్తోంది. లివిపిల్–500 మెడిసిన్ నకిలీగా బయటపడడంతో మిగతా మందులపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. నకిలీ మందులపై జరుగుతున్న దాడులతోనైనా కల్తీమయంగా మారిన కరీంనగర్ డ్రగ్ మార్కెట్‌లో నకిలీ మందులకు అడ్డుకట్ట పడేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయమై డ్రగ్ కంట్రోల్ అథారిటీకి చెందిన డ్రగ్ ఇన్స్‌పెక్టర్, అడిషనల్ డైరెక్టర్లను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.
జనన రేటు తగ్గడం
ఆందోళనకరం
కరీంనగర్‌టౌన్: దేశంలో జనన రేటు తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కరీంనగర్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలో బెస్ట్ సర్జన్‌లుగా డాక్టర్ మహమ్మద్ అలీమ్, డాక్టర్ నిక్కత్ పర్వీన్, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డిని సత్కరించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ సీ్త్రవిద్యలో అభివృద్ధి, వివాహ వయస్సు పెరగడం, అందుబాటులో ఉన్న గర్భ నిరోధక సాధనాలు, జీవన వ్యయం పెరుగుదల, వృత్తి, కెరీర్‌పై దృష్టి సారించడంతోనే జనన రేటు తగ్గుతుందన్నారు. వైద్యులు సుధ, రవీందర్‌రెడ్డి, ఉమాశ్రీ, సాజిదా, విప్లవశ్రీ, సనజవేరియా, రాజగోపాల్, విమల, స్వామి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పత్తి మార్కెట్‌కు
రెండు రోజుల సెలవు
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు శని, ఆదివారం సెలవులు ఉంటాయని ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం క్వింటాల్ పత్తి రూ. 7,450 పలికిందని వారు వివరించారు.

డ్రగ్ మాఫియాపై కొరడా