
గడ్డి మందుతాగిన ఆంధ్రా మేసీ్త్ర మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన మేసీ్త్ర ఎనమల యేసుబాబు(55) చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. అప్పుల బాధతో మనస్థాపానికి గురై బుధవారం గడ్డిమందు తాగాడు. అపస్మారక స్థితికి చేరిన యేసుబాబును మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో స్థానికంగానే వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు కోరడంతో ఇక్కడే చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామం ఒంగోలుకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ..
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని విజయపురి కాలనీకి చెందిన అంకం కృష్ణవేణి (28) ఈనెల 3న భవనంపైనుంచి పడగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. కృష్ణవేణి మరో ఇంటికి మారడం కోసం సామాన్లు సర్దుతుండగా రాత్రి సమయంలో పిల్లలు మొదటి అంతస్తులో ఆడుకుంటున్నారు. వారు పడిపోతారన్న తొందరపాటులో వారిని కాపాడే క్రమంలో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడింది. ఆమె తలకు తీవ్రగాయాలు కాగా.. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందింది. ఆమె భర్త అంకం తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు.
వ్యసనాల కోసం చోరీ.. యువకుడి అరెస్ట్
చొప్పదండి: ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ఆడుతూ డబ్బు సరిపోక చోరీకి పాల్పడి పట్టుబడ్డ యువకుడి ఉదంతం ఇది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాగంపేటకు చెందిన కొలిపాక మధుకుమార్ ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బు కోసం దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ నెల 8న పట్టపగలు గ్రామంలోని కొమురయ్య అనే వ్యక్తి ఇంట్లో ఎవరూలేని సమయంలో లోపలికి ప్రవేశించి బీరువాలోని తులం బంగారం, రూ.22 వేల నగదు ఎత్తుకెళ్లాడు. అదే రోజు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై నరేశ్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా మధును గుర్తించి శనివారం రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై నరేశ్‌రెడ్డి, ఏఎస్సై సమ్మయ్య, అనిల్‌కుమార్, శ్రీధర్, ఎండీ ఖలీఫాను సీఐ ప్రదీప్‌కుమార్ అభినందించారు.

గడ్డి మందుతాగిన ఆంధ్రా మేసీ్త్ర మృతి