
సామాజిక పరివర్తనకు మార్గం కవిత్వం
కరీంనగర్‌కల్చరల్: సామాజిక పరివర్తనకు కవిత్వం మార్గం వేస్తుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి సి. పార్థసారథి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జాతీయ సాహిత్య పరిషత్, కరీంనగర్ జిల్లా శాఖ నిర్వహించిన రజనీశ్రీ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కార ప్రదానం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కవిత్వం మాటల సమాహారం మాత్రమే కాదని, అది భావోద్వేగాల ప్రతిబింబంగా, విలువల్ని నిలబెట్టే సాధనంగా సమాజంపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లారెడ్డి మురళీమోహన్ రచించిన శ్రీనిశాచరుడి దివాస్వప్నంశ్రీ కవిత్వ సంపుటికి రజినీశ్రీ పురస్కారం కింద రూ.11 నగదు బహుమతి, మెమోంటోతో సత్కరించారు. జాతీయ సాహిత్య పరిషత్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాజుల రవీందర్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో పురస్కార ప్రదాత, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సంయుక్త కార్యదర్శి జీవీ శ్యాంప్రసాద్‌లాల్, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, ప్రముఖ సాహితీవేత్త డా.గండ్ర లక్ష్మణరావు, ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ తదితరులున్నారు.