
మాటే మంత్రం కావాలి.. ప్రభావం చూపాలి
హుజూరాబాద్: ప్రాథమిక విద్య సమయంలోనే విద్యార్థులపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెడితే ఉన్నత విద్యకు వచ్చే సరికి సరైన దారిలో ముందుకెళ్లే అవకాశముంటుంది. కాగా, గతం, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు సైతం తపన పడుతున్నారు. దానికి తగ్గటుగా డిజిటల్ బోధన అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటుండగా, ఉన్నత విద్యకు వచ్చేసరికి చాలా మందిలో క్రమశిక్షణ లోపిస్తుండటంతో ఉన్నత విద్య ప్రమాదంలో పడిపోతోంది.
కుదరని సత్సంబంధాలు
విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలు కుదరడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. విద్యార్థుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు తోడ్పాటు లేకపోవడం, వారి మంచి ప్రవర్తనను అభినందించకపోవడం, వారికి ఎక్కువ అవకాశాలు కల్పించకపోవడం, సృజనాత్మక సామర్థ్యాలు, అభిరుచులను ప్రోత్సహించకపోవడం, జీవిత ప్రాముఖ్యతను తెలుసుకునేలా చెప్పకపోవడం, వారిలో భద్రతాభావనను పెంపొందించకపోవడం తదితర కారణాలతో సత్సంబంధాలు లేక అర్థవంతమైన బోధన జరగడం లేదు. ఫలితంగా విద్యార్థుల్లో చదువు భరోసా కంటే భయాన్ని రెట్టింపు చేస్తోంది.
తల్లిదండ్రులే రోల్ మోడల్
● పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులే రోల్‌మోడల్. బాల్యంలో తల్లిదండ్రులు ఏం చెబితే అది చేస్తారు. ఏది నేర్పిస్తామో అదే పాటిస్తారు. ఈ విషయాన్ని కీలకంగా భావించాలి.
● వేలకు వేలు ఫీజులు చెల్లించి బడికి పంపిస్తే గురువులే పిల్లల్ని తీర్చిదిద్దుతారని భావించడం భ్రమ.
● మనం ఎంత బిజీ జీవితంలో ఉన్నా.. వారితో కలిసి ఆహారం తీసుకోవం మరువద్దు. అలాగే పిల్లలతో ఆటలాడాలి. అవి ఏ ఆటలైనా సరే.. క్యారమ్స్, గల్లీ క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడటం మంచిది. అలాగే వారితో కలిసి పుస్తక పఠనం చేయాలి. పిల్లలు చదువుతున్న పుస్తకాల్ని చూసి అందులోని మంచి విషయాల్ని వివరించాలి.
● పిల్లలతో గడిపే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా ఉండాలి. వీడియో గేమ్స్, ఫోన్‌లో వీడియోలు చూపించడం చేస్తుంటాం. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.
● పెద్దల మధ్య ఎన్నో జరగవచ్చు. వాటిని పిల్లల ముందు మాట్లాడుకోకూడదు. వారు అలాంటి వారు.. ఇలాంటి వారంటూ వ్యతిరేక భావనల్ని నూరిపోయొద్దు. అలాగే ఒకరితో మరొకరిని పోల్చడం కూడా మంచిది కాదు.
● పిల్లలతో గడిపే సమయంలో అతి గారాబానికి అవకాశమిస్తారు. ఏదీ అడిగితే అది కొనిస్తారు. అడిగిన వెంటనే కొనిస్తే ఆ వస్తువు విలువ పిల్లలకు తెలియదు. అలాగే పిల్లల బ్లాక్‌మెయిలింగ్‌కు పెద్దలు భయపడడం ఇది వారిని చెడగొడుతుంది. ఏమైనా వారు గట్టిగా కోరుతుంటే దాని ప్రాధాన్యం, లాభనష్టాల్ని వివరించి ఆ తర్వాత ఇప్పించవచ్చు.
● పిల్లలపై కోపతాపాలు వద్దు. వారి అభిప్రాయాలపై వెంటనే వ్యతిరేకత వ్యక్తం చేయొద్దు. వారు చెప్పింది పూర్తిగా విని మంచి చెడుల్ని చెప్పాలి. మీ పిల్లాడు చదువుపై ఏకాగ్రత చూపించట్లేదని ఎవరైనా చెబితే కోపం వ్యక్తం చేస్తూ వారు మరింత కఠినంగా ఉండేలా చేయడం మంచిది కాదు.
● పిల్లల్ని కొట్టడం, తిట్టడం.. ఆడ, మగ తేడా చూపించడంతో ఏకాగ్రత దెబ్బతిని, వ్యతిరేక భావనల్ని వారు పెంచుకుంటారు. ప్రవర్తనను బట్టి వారిని తీర్చిదిద్దాలి