
35 ఏళ్లుగా సాయి సేవలో..
● ట్రస్ట్, దాతల సహకారంతో అభివృద్ధి
వేములవాడ: పట్టణంలోని మార్కండేయనగర్‌లో 1990 లో నిర్మించిన సాయిబాబా ఆలయానికి 35 ఏళ్లుగా సేవలందిస్తూ భక్తులు, స్థానికుల మన్ననలు పొందుతున్నా రు. ట్రస్టీలు, దాతల సహకారంతో 35 ఏళ్లు పూర్తిచేసుకు ని రూ.3 కోట్లతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈనెల 10న నిర్వహించే గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ట్రస్టీలు ప్రణాళికలు సిద్ధం చేశారు.
1990లో బాబా గుడి పునాది
మార్కండేయనగర్‌లో 1990లో అప్పటి సర్పంచ్ ప్రతాప చంద్రమౌళి ఆధ్వర్యంలో పాలకమండలి లేఅవుట్ స్థలాన్ని సాయిబాబా సంస్థాన్‌కు అప్పగించింది. షిరిడీ సాయిబాబా సేవాసంస్థాన్ ట్రస్ట్ పేరుతో ఏర్పడిన ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా అప్పటి వార్డు సభ్యుడు వారాల దేవయ్యను ఎన్నుకున్నారు. 1993లో ఆలయ నిర్మాణం పూర్తయింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయం ఇరుకుగా మారింది. దీంతో దాతల సహకారం, ట్రస్టీల ప్రోత్సాహంతో ఇప్పటివరకు రూ.3 కోట్లు ఖర్చుచేసి 2011లో నూతన భవనం నిర్మించుకున్నారు.
ట్రస్టీల సేవానిరతి
ఎలాంటి పారితోషికం లేకుండా 35 ఏళ్లుగా ఆలయంలో ఉచితంగా భక్తులకు సేవలందిస్తున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా వారాల దేవయ్య, ట్రస్టీలుగా గంప రాజేందర్, కూర రమేశ్, కోనమ్మగారి నాగరాజు, బండారి కుమార్, రైకనపాట శ్రీనివాస్, గంప గౌరిశంకర్, నాగుల యాదగిరి, ఎంబేరి నర్సయ్య, పీచర రవీందర్‌రావు, టి. కృష్ణస్వామి, తొగరి వెంకటేశ్ కొనసాగుతున్నారు. ట్రస్టీలు చేస్తున్న సేవలు గుర్తించిన పలు సంస్థలు అవార్డులు ప్రకటించాయి. 2009లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్‌లో వేములవాడ సాయిబాబా ఆలయం నుంచి వారాల దేవయ్యను ఎంపిక చేశారు.