
అడవంతా పండుగ..
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం శీత్లాభవాని అమ్మవారి వేడుకలకు తండాలు ముస్తాబయ్యాయి. అడవి బిడ్డల ప్రత్యేక పండుగగా శీత్లా భవానిని వేడుకుంటారు. వర్షాకాలం ఆరంభమై పెద్దపూసల కార్తీలో గిరిజన తండాలో శీత్లా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. జూలై తొలి, రెండో మంగళవారాల్లో సంప్రదాయ బద్ధంగా పండుగ జరుపుకుంటారు. తండాల పోలిమేర్ల వద్ద శీత్లా భవానిని ప్రతిష్టించి యువతులు బోనాలు ఎత్తుకుని అక్కడికి చేరుకుంటారు. కోళ్లు, మేకలు, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పశువులన్నింటినీ ఒక చోట చేర్చి బలి ఇచ్చిన మేక పేగు మీదుగా వాటిని దాటిస్తారు. బావి నుంచి తెచ్చిన నీటిని వాటిపై చల్లుతారు. ఆ కారణంగానే దీనికి దాటుడు పండుగగా పేరొచ్చింది. గిరిజన యువతుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కాగా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 126 తండాల్లో ఒకే రోజు మంగళవారం పండుగ నిర్వహించాలని జిల్లా బంజారా సేవా సంఘం ప్రతినిధులు నిర్ణయించారు.
నైవేద్యాలతో అటవీ ప్రాంతాలకు..
శీత్లా భవాని వేడుకలను పురస్కరించుకుని ఉదయమే గిరిజనులు నైవేద్యాలతో ఊరేగింపుగా అటవీ ప్రాంతానికి తరలివెళ్తారు. అక్కడ తమ దేవతలైన శీత్లా భవాని, తుల్జా భవాని, మసూరి భవాని, అంబ భవాని, దుర్గా భవాని, మాతలకు మొక్కులు చెల్లించుకుంటారు. పిల్లపాపలు, పశు సంపద బాగుండాలని, పంటలు సంమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా కురువాలని పూజలు చేస్తారు. అనంతరం గిరిజన మహిళల నృత్యాలు ఉంటాయి. శీత్లా భవాని తల్లిని ప్రధాన దేవతగా కొలుస్తారు. పెళ్లికాని యువతులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మంచి వరుడు దొరకాలని వేడుకుంటారు. మూడురోజుల పాటు జరుపుకునే ఈ పండుగ కోసం సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా స్థిరపడినవారు స్వగ్రామాలకు చేరుకుంటారు.
నేడు శీత్లా భవాని వేడుకలకు
తండాలు ముస్తాబు
నైవేద్యాలతో అటవీ ప్రాంతాలకు తరలనున్న గిరిజనులు
కోరికలు నెరవేరుతాయి
శీత్లాభవాని అమ్మవారిని కొ లిస్తే కోరికలు నెరవేరుతా యి. పశుసంపద, పంటలు, ఆయురారోగ్యాలతో ఉండాలని పండగ రోజు అమ్మవా రిని కొలుస్తాం. పిండి నైవేద్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మొక్కులు చెల్లించుకుంటాం. ఏటా ఇదే మాసంలో పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. – అజ్మీరా రజిత,
మాజీ సర్పంచ్, బుగ్గారాజేశ్వర తండా

అడవంతా పండుగ..

అడవంతా పండుగ..