
ఆ రోజు బాధేసింది.. ఈరోజు ఆనందంగా ఉంది
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రంలో ఇన్నాళ్లు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ప్రతిష్టాత్మకంగా భావించానని, చాలామంది తమను హకీంపేటకు మార్చాలని దరఖాస్తులు వచ్చాయని కానీ 200 ఎకరాల్లో ఉన్న హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ కంటే కరీంనగర్‌లోని స్పోర్ట్స్ స్కూల్ చాలా బాగుందని సంబురపడ్డారు క్రీడా మంత్రి వాకటి శ్రీహరి. సోమవారం కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డిలతో కలిసి పర్యటించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌కు శాట్స్ ఎండీ, చైర్మన్‌లతో కలిసి ఒక రోజు ఉదయాన్నే వెళ్లానని కానీ నేను అనుకున్నట్లుగా అక్కడ వసతులు లేవని తినకుండానే తిరిగొచ్చామన్నారు. కరీంనగర్‌కు వచ్చే ముందు హకీంపేటలోనే ఏమీ లేవు ఇక కరీంనగర్ ఎలా ఉంటుందో అనుకొని వచ్చానని కానీ ఇక్కడి వసతులు, వాతావరణం, సౌకర్యాలు చూసి మనసు ఉల్లాసమైందన్నారు. నాకు ఆరోజు బాధేసిందని..కానీ ఈ రోజు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగ ఆయాన కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్‌ను చూసి మురిసిపోయారు. ప్రపంచం గర్వపడేలా క్రీడల్లో రాణించాలని చిన్నారులకు సూచించారు.
క్రీడా వసతులపై శాట్స్ ఎండీ ఆరా
కరీంనగర్‌లో క్రీడా శాఖ మంత్రి పర్యటన సందర్బగా రాష్ట్ర క్రీడా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి కూడా వచ్చారు. మంత్రి ఇతర కార్యక్రమాలకు వెళ్లగా ఆమె ప్రాంతీయ క్రీడా పాఠశాలను పరిశీలించి క్రీడా వసతులపై ఆరా తీశారు. కాసేపు శాట్స్, క్రీడా శాఖ, ఒలింపిక్, క్రీడాపాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. క్రీడా పాఠశాలలో రెజ్లింగ్, జూడో, అథ్లెటిక్స్ తదితర క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో శాట్ డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, డీవైస్‌వో శ్రీనివాస్ గౌడ్, డీఈవో శ్రీరామ్ మొండయ్య, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ క్రీడా పాఠశాలపై మంత్రి వాకటి శ్రీహరి