చిన్నమ్మే పాప ప్రాణం తీసింది..!? | - | Sakshi
Sakshi News home page

చిన్నమ్మే పాప ప్రాణం తీసింది..!?

Jul 7 2025 6:14 AM | Updated on Jul 7 2025 6:14 AM

చిన్న

చిన్నమ్మే పాప ప్రాణం తీసింది..!?

కోరుట్ల: పట్ణణంలో శనివారం రాత్రి హత్యకు గురైన ఆరేళ్ల బాలిక హితక్షి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. చిన్నారిని ఆమె చిన్నమ్మే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముందుగా మృతదేహం దొరికిన ఇంటి యజమానిని అనుమానించినా వాస్తవం కాదని నిర్ధారించుకున్నారు. తోటికోడలు పెత్తనం సహించలేకే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. హత్యలో ఒక్కరే ఉన్నారా..? లేక మరెవరైనా పాలుపంచుకున్నారా..? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు.

ఇంటి పెత్తనంపై ఈర్ష్య..?

కోరుట్లలోని ఆదర్శనగర్‌కు చెందిన ఆకుల మదన్‌మోహన్‌కు ఇద్దరు కుమారులు. రాము, లక్ష్మన్‌ కవలలతోపాటు ఓ కూతురు ఉన్నారు. రాముకు నవీనతో.. లక్ష్మణ్‌కు మమతతో గతంలోనే వివాహమైంది. నవీన, మమత అక్కాచెల్లెళ్ల కూతుళ్లు. రాము, నవీన దంపతులకు కుమారుడు వేదాంశ్‌, కూతురు హితక్షి (6) ఉన్నారు. లక్ష్మణ్‌ మమత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. మదన్‌మోహన్‌ ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఏడాది క్రితం కుమారులిద్దరినీ తన వెంట తీసుకెళ్లాడు. అప్పటి నుంచి నవీన, మమత అత్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎంబీఏ పూర్తిచేసిన మమత నాలుగు నెలల క్రితం ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడి రూ.18 లక్షలు కోల్పోయినట్లు సమాచారం. దీనిపై కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌క్రైం కేసు నమోదైంది. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియకుండా ఉంచాలని అనుకు న్నా.. సాధ్యంకాలేదు. పైగా కుటుంబంలో కొద్ది కాలంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఇంట్లో నవీనకు గుర్తింపు ఎక్కువగా ఇస్తున్నారని మదనపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నవీనాపై ద్వేషం, ఈర్ష్య పెంచుకున్నట్లు తెలిసింది.

అంతా పథకం ప్రకారమే..

కక్ష పెంచుకున్న మమత.. నవీన కూడా తనలాగే బాధపడాలని భావించి అదునుకోసం కొద్దికాలంగా ఎదురుచూసినట్లు సమాచారం. శనివారం ఉదయం వేదాంశ్‌, హితక్షిని స్కూల్‌కు పంపిన నవీన.. ఆడపడుచుతో కలిసి కరీంనగర్‌కు షాపింగ్‌ కోసమని వెళ్లడంతో ఇంట్లో అత్తతోపాటు మమత మాత్రమే ఉన్నారు. సాయంత్రం స్కూల్‌ నుంచి పిల్లలు రాగానే మమత వారితో కలిసి పెద్దపులుల వేషధారణలు చూసేందుకు వెళ్లింది. అదే సమయంలో తన వెంట కూరగాయలు కోసే కత్తి, మొక్కలు కత్తిరించే కట్టర్‌ను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. సమీపంలోని ఇంటికి గేట్‌, బాత్‌రూంకు తలుపు లేకపోవడం.. సదరు ఇంటి యజమానికి ఆ ఏరియాలో కొంత వివాదాస్పదుడిగా పేరు ఉండటంతో ఆ ఇంటిని హత్య కోసం ఎంచుకున్నట్లు సమాచారం. రాత్రి 7.30 గంటల సమయంలో ముగ్గురు పిల్లలను ఇంటికి పంపిన మమత హితక్షిని సదరు ఇంట్లోకి తీసుకెళ్లి గొంతుపై కత్తితో కోసినట్లు, కట్టర్‌తో మెడ, గొంతు చుట్టు కత్తిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హితక్షి చనిపోగానే హడావుడిగా ఇంటికి తిరిగి వెళ్లిన మమత.. రక్తం మరకలు ఉన్న దుస్తులు వాషింగ్‌ మిషన్‌లో వేసి దుస్తులు మార్చుకుని.. అందరితోపాటు హితక్షి కోసం వెతికినట్లు సమాచారం. హితక్షి మృతదేహం దొరకగానే నవీనతో కలిసి ఆసుపత్రికి వచ్చిన మమత అక్కడ బోరున విలపించడం గమనార్హం.

కీలకంగా మారిన డాగ్‌స్క్వాడ్‌

శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో హితక్షి కనిపించకపోవడంతో సుమారు గంటన్నర పాటు వెతికిన నవీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి 9 గంటల సమయంలో సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లోని బాత్‌రూంలో హితక్షి మృతదేహం లభ్యమైంది. రాత్రి పది గంటల సమయంలో ఎస్పీ అశోక్‌కుమార్‌, మెట్‌పల్లి డీఎస్పీ రాములు కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌ సాయంతో విచారణ జరిపారు. మొదటగా బాలిక మృతదేహం దొరికిన వ్యక్తిని అనుమానించిన పోలీసులు.. అతను వరంగల్‌ జిల్లాలోని నర్సంపేటలో ఉన్నానని చెప్పడంతో వీడియోకాల్‌ సాయంతో ధ్రువీకరించుకున్నారు. ఇంట్లో ఏమైనా కుటుంబకలహాలు ఉన్నాయా..? అనే విషయంపై దృష్టి సారించిన పోలీసులు అదే రాత్రి డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. ఆ డాగ్‌ బాలిక మృతదేహం దొరికిన ఇంటి నుంచి మళ్లీ బాలిక ఉండే ఇంటికి వెళ్లి ఆగిపోయినట్లు సమాచారం. దీంతో బాలికను ఇంట్లోని వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు.

పట్టించిన సీసీ కెమెరా..

డాగ్‌ స్క్వాడ్‌ చిన్నారి ఇంటి గేటు వద్ద ఆగిపోవడంతో పోలీసులు.. ఇంటి ముందున్న సీసీ కెమెరాను పరిశీలించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో పెద్దపులుల వేషధారులు ఆడుతుండగా.. మమత వాటిని చూసేందుకు తన ఇద్దరు కూతుళ్లతోపాటు వేదాంశ్‌, హితక్షిని తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అరగంట తర్వాత ముగ్గురు పిల్లలు మాత్రమే ఇంటికి చేరుకున్నారు. తరువాత 15 నిమిషాలకు మమత హడావుడిగా ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అదే సమయంలో మమత వెంట హితక్షి లేకపోవడంతో పోలీసులు ఆమెను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు. బాలిక హత్యలో మమతతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మాత్రమే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం హితక్షి తాత మదన్‌మోహన్‌, తండ్రి రాములు సౌదీ నుంచి ఇంటికి చేరుకోగా.. అంత్యక్రియలు పూర్తి చేశారు.

మలుపు తిరిగిన బాలిక హత్య కేసు..

పోలీసుల విచారణలో నివ్వెరపోయే నిజాలు

తోటికోడలు పెత్తనంపై ఈర్ష్య, ద్వేషమే కారణమా..?

కొంత కాలంగా ఇంట్లో గొడవలు

లోతుగా విచారణ చేపడుతున్న పోలీసులు

చిన్నమ్మే పాప ప్రాణం తీసింది..!?1
1/1

చిన్నమ్మే పాప ప్రాణం తీసింది..!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement