
యువకుడి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంగెపు చందుకుమార్ (22) కొన్నాళ్లుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఒంటరితనంతో మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ శివారులోని నల్లగుట్ట వద్ద గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుని సోదరుడు సంగెపు రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఈదులపూర్ గ్రామశివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంథని డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ తోట శ్రీకాంత్(30) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి స్వగ్రామం కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేట. ముత్తారం వైపు నుంచి తన బైక్‌పై జాఫర్‌ఖాన్‌పేట వెళ్తున్న శ్రీకాంత్‌ను పెద్దపల్లి నుంచి అడవిశ్రీరాంపూర్ వైపు బైక్‌పై వెళ్తున్న వారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శ్రీజ, ఏడాదిన్నర వయసుగల బాబు ప్రణీత్, తల్లిదండ్రులు అనసూర్య, గట్టయ్య ఉన్నారు. శ్రీకాంత్ మృతితో జాఫర్‌ఖాన్‌పేట గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని పురాణిపేటలో తాళం వేసిన ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. రాయికల్ మండలం దావన్‌పల్లికి చెందిన బానోవత్ సంతోష్ పురాణిపేటలో అద్దెకుంటాడు. ఇంటి వద్ద పండుగ ఉండటంతో ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లాడు. బుధవారం తిరిగి వచ్చేసరికి ఇంట్లోని సామగ్రి చిందరవందరగా పడి ఉంది. బీరువాలో ఉన్న 4 గ్రాముల బంగారం, 7 గ్రాముల వెండి ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు.
మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరీ
కరీంనగర్‌క్రైం: ఒక మహిళ మెడలోంచి గుర్తుతెలియని వ్యక్తి బంగారు గొలుసు దొంగిలించాడు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన స్వరూప, ఆమె సోదరి అంజలి ప్రధాన కూరగాయల మార్కెట్ వద్ద కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. అంజలి బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆటోలో మార్కెట్ వెళ్లింది. తర్వాత గుర్తుతెలియని వ్యక్తి వారి ఇంట్లోకి ప్రవేశించి స్వరూప మెడలో ఉన్న బంగారు గొలుసు ఎత్తుకొని వెళ్తుండగా.. అప్రమత్తమైన స్వరూప అతడిని వెంబడించగా ఇంటి గేటు నుంచి పరారయ్యాడు. ఈ విషయంపై త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం బృందాలుగా ఏర్పడిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

యువకుడి ఆత్మహత్య