
తేలని బకాయిల రికవరీ !
● విచారణలో బయటపడి మూడు నెలలు
● సీఈవో స్వాహా చేసిన సొమ్ము రూ.1.03కోట్లు
● పాలకవర్గం రికవరీ చేయాల్సిన సొమ్ము రూ.65లక్షలు
● బకాయిల వసూళ్లపై అధికారుల ఉదాసీనత
చందుర్తి(వేములవాడ): చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి, అక్రమాలు విచారణలో బయటపడి మూడు నెలలు గడుస్తున్నా రికవరీకి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రైతుల పేరిట పంట రుణాలను తీసుకుని స్వాహా చేసిన సీఈవో గంగారెడ్డిని 8 నెలల క్రితమే సస్పెన్షన్ చేసి, రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. 51 విచారణలో సొసైటీకి సంబంధించిన రూ.1.68 కోట్లు పక్కదారి పట్టాయని విచారణలో తేలింది. ఇందులో రూ.1.03 కోట్లు సస్పెన్షన్‌కు గురైనా సీఈవో గంగారెడ్డి స్వాహా చేశాడని తేలింది. అంతేకాకుండా మరో రూ.65లక్షలను సొసైటీలో వ్యక్తిగత రుణాలు, దీర్ఘకాలిక రుణాలు అందించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ బకాయిలను 2008 నుంచి ఇప్పటి వరకు పాలకవర్గం సభ్యులు వసూలు చేయించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటి సమాచారం తమ వద్ద లేదని ఈనెల 4న సహకార సంఘం అధికారి వివరణ ఇచ్చినట్లు పాలకవర్గం సభ్యులు ప్రచారం చేస్తున్నారు. కానీ సహకార సంఘం అధికారులు మాత్రం విచారణ కొనసాగుతోందని తెలుపుతున్నారు. స్వాహా సొమ్మును, బకాయిపడ్డ డబ్బుల వసూలుకు సహకార అధికారులు పాలకవర్గం సభ్యులకు నోటీసులు జారీ చేస్తూ జాప్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
రుణగ్రహీతలకు పోలీసుల పిలుపు
చందుర్తి సహకార సంఘంలో వ్యక్తిగత, దీర్ఘకాలిక రుణం తీసుకుని ఏళ్లుగా చెల్లించకుండా బకాయిపడడానికి కారణాలను తెలుసుకునేందుకు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణకు రంగం సిద్ధ చేస్తున్నారు. రైతులకు తెలియకుండా సస్పెన్షన్‌కు గురైన సీఈవో తీసుకున్న రుణాలపై ఆరా తీసేందుకు పోలీసులు దృష్టి సారించినట్లు తెలిసింది.
ఆడిట్ అధికారులు చర్యలేవి ?
సహకార సంఘంలోని ఆదాయ, వ్యయాలను ఏటా ఆడిట్ చేసి నివేదికలను అందించిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణాలు చెప్పాలని డిమాండ్ ఉంది. అవినీతి, అక్రమాల వెనుక సీఈవోతోపాటు ఆడిట్ అధికారులను విస్మరించడం వెనుక అనుమానాలకు దారితీస్తున్నాయి. సుమారు 13 ఏళ్లుగా కొనసాగుతున్న అవినీతి, అక్రమాల తంతును ఆడిట్ అధికారులు ఎందుకు బహిర్గతం చేయలేకపోయారన్న సందేహాలు సభ్యులకు, పాలకవర్గ సభ్యుల్లో తలెత్తుతున్నాయి. ఆడిట్ అధికారులపై చర్యలు తీసుకోకుండా పాలకవర్గం సభ్యులకు జిల్లా సహకార సంఘం అధికారి రెండు పర్యాయాలు నోటీసులు జారీచేయడం విమర్శలకు తావిస్తోంది.
బకాయి వసూళ్లకు భయమెందుకు?
సహకార సంఘంలో ఏళ్ల తరబడి బకాయిలు ఉంటే సహకార సంఘం చట్టం ప్రకారం ఆస్తులను జప్తు చేయకుండా పాలకవర్గం సభ్యులు నోటీసులు ఇస్తూ జాప్యం చేయడం వెనుక ఉద్దేశ్యమేమిటన్న ప్రశ్నలు పలువురిలో తలెత్తుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు బకాయిలు చెల్లించకుంటే గతంలో ఇంటి తలుపులు తీసిన సంఘటనలు ఉన్నాయి. బకాయిపడ్డ వీరిపై చర్యలు తీసుకోకపోవడానికి ఏ సహకార సంఘం చట్టం అడ్డు వచ్చిందని సభ్యులు, అధికారులు ప్రశ్నిస్తున్నారు.
విచారణ కొనసాగుతోంది
51 విచారణతోపాటు వ్యక్తిగత విచారణ కొనసాగుతోంది. అవినీతి, అక్రమాలతో సంబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టేదే లేదు. అంతేకాకుండా వ్యకిగత, దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వారిని పోలీసులు విచారణ చేపడుతున్నారు. వారి విచారణ అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నాం. సహకార చట్టం ప్రకారం చర్యలు తప్పవు.
– రామకృష్ణ,
జిల్లా సహకార సంఘం అధికారి