
పచ్చిరొట్ట.. చేనుకు పుష్టి
జగిత్యాలఅగ్రికల్చర్: భూమికి కావాల్సిన పోషకాలు అందించేందుకు రైతులు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టను ఎంచుకుంటున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచన మేరకు పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగను చల్లి.. పూతదశకు చేరుకున్న తర్వాత కేజీవీల్స్ ట్రాక్టర్స్‌తో కలియ దున్నుతున్నారు. ఇలా దాదాపు ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చు తగ్గించుకుంటున్నారు.
దొరకని సేంద్రియ ఎరువులు
జగిత్యాల జిల్లాలో వరిని దాదాపు మూడు లక్షల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. వరికి అవసరమైన పోషకాలు అందిచేందుకు కోళ్లఎరువు లేదా పశువుల ఎరువు వేయాల్సి ఉంది. అయితే కోళ్ల ఎరువు లారీ లోడ్ ధర రూ.28వేలకు చేరింది. పశువుల ఎరువుకు రూ.25వేలు పలుకుతోంది. పైగా రైతులందరికీ సరిపడా లభ్యం కావడం లేదు. గొర్రెలమందను ఒక్కరోజు పెట్టించాలంటే దాదాపు రూ.రెండుమూడువేలు తీసుకుంటున్నారు. ఇలా పంటకు వచ్చే ఆదాయం కంటే.. ఖర్చే ఎక్కువ అవుతోంది. దీంతో రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించారు.
పచ్చిరొట్ట పైర్లతో భూమికి బలం
తక్కువ ఖర్చు.. తక్కువ సమయంలో భూమిలో ఉండే పంటలకు ఎరువుగా ఉపయోగపడే పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లి పెసర వేయడం వైపు రైతులు దృష్టి పెట్టారు. ఈ విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తుండడంతో రైతులు మరింత ఆసక్తి కనబర్చుతున్నారు. తొలకరి వర్షాలు పడగానే జూన్ మొదటి వారంలో పచ్చిరొట్ట విత్తనాలు వేసిన రైతులు, ప్రస్తుతం పూతదశలో ఉన్న జనుము, జీలుగను పొలంలోనే కేజీవీల్స్‌తో దున్నేస్తున్నారు. దున్నిన తర్వాత ఎకరాకు 25కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేస్తే నీటిలో కలిసిపోతుంది. మరోసారి ట్రాక్టర్‌తో దున్ని నాట్లు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 15 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను రైతులు వరి నాటు వేసే పొలంలో వేశారు.
ఎరువుల ఖర్చు తగ్గించుకుంటున్న రైతులు
పచ్చిరొట్ట పంటలతో ఎకరాకు 8నుంచి9 టన్నుల పచ్చిరొట్ట లభ్యమవుతుంది. దీనివల్ల భూమి బలంగా తయారవడమే కాకుండా ప్రధాన పోషకాలైన నత్రజని అధికంగా.. భాస్వరం, పోటాషియం మోస్తరుగా అందుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పచ్చిరొట్ట వేసిన భూమిలో కొందరు రైతులు రసాయన ఎరువులను తక్కువగా వినియోగిస్తున్నారు. చేను ఏపుగా పెరగడం ద్వారా మరికొందరు రైతులు అసలే వేయడమే లేదు. పచ్చిరొట్ట పదార్థంలో ఉండే ఎంజైములు మట్టిలో లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఇనుము మొదలైన పోషకాలతో దిగుబడి గణనీయంగా పెరుగుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
పూత దశలో కేజీవీల్స్‌తో దున్నుతున్న రైతులు
తగ్గనున్న రసాయన ఎరువుల ఖర్చు
పచ్చిరొట్ట ఏటా వేస్తా
ఏటా వరి సాగు చేసే పొలాల్లో జీలుగ చల్లుతాను. పూత దశకు వచ్చిన తర్వాత ట్రాక్టర్‌తో కలియదున్నుతాను. రసాయన ఎరువులను సిఫారసు చేసిన దానికంటే తక్కువగా వేస్తాను. పంట దిగుబడి కూడా అధికంగా పెరుగుతోంది.
– ఏలేటి జలేందర్, ఇటిక్యాల, రాయికల్
పూత దశలో దున్నితే లాభం
వరి పండించే భూముల్లో ఎక్కువగా పచ్చిరొట్ట సాగు చేయడం మంచి పరిణా మం. జీలుగ, జనుమును పూతదశ వచ్చిన తర్వాత భూమిలోనే కలియదున్నితే బలంగా తయారవుతుంది. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
– భాస్కర్, వ్యవసాయాధికారి, జగిత్యాల

పచ్చిరొట్ట.. చేనుకు పుష్టి

పచ్చిరొట్ట.. చేనుకు పుష్టి

పచ్చిరొట్ట.. చేనుకు పుష్టి