
‘చిరు’సాయం భవితకు నవోదయం
● సత్ఫలితాలిస్తున్న ఆపరేషన్ స్మైల్, ముస్కాన్
● అనాథ పిల్లలకు కొండంత అండ
● ఈనెల 31వరకు ఆపరేషన్ ముస్కాన్
కరీంనగర్: చిన్నారుల సంరక్షణలో భాగంగా జిల్లా బాలల సంరక్షణ విభాగం, పోలీసు, కార్మిక శాఖ సంయుక్తంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో ఏటా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జులైలో ఆపరేషన్ ముస్కాన్ పేరిట నిర్వహిస్తున్నారు. అనాథలకు కొండంత అండగా భరోసా ఇస్తున్న ఆపరేషన్ స్మైల్, అపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి.
ఎవరెవరిని సంరక్షిస్తారంటే
భిక్షాటన చేసే, తప్పిపోయిన చిన్నారులు, బస్టాండ్‌లోని బాలలు, వీధి, అనాథ, బాల కార్మికులు, బడి మానేసిన పిల్లలు, చెత్త సేకరించే వారు, మతి స్థిమితం లేని వారు, బాల్య వివాహాలు అడ్డుకోవడం, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే విభాగాల్లో చిన్నారులను గుర్తించి సంరక్షిస్తారు. సందర్భానుసారంగా ఆయా వాటిల్లో యజమానులు, నిర్వాహకులపై పోలీసు, కార్మిక శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తారు. అనాథ బాలల సంరక్షణలో భాగంగా సీడబ్ల్యూసీ (బాలల సంక్షేమ సమితి) ఎదుట హాజరుపర్చుతారు. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడుతారు.
శాఖల సమన్వయంతో
రెండు బృందాలు ఏర్పాటు
ప్రభుత్వం ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోంది. ఈ నెల 31వ తేదీ వరకు 11వ విడత ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కరీంనగర్, హుజూరాబాద్ డివిజన్లకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కాని స్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్‌ను నియమించారు. ఈ కమిటీలు జిల్లా బాలల సంరక్షణ విభాగం, కార్మిక, విద్య, ఇతర శాఖల సమన్వ యంతో నెలపాటు వ్యాపార సంస్థలు, ఇటుక బట్టీలు, హోటళ్లు, పరిశ్రమలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లు.. ఇలా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తారు. బిచ్చగాళ్లుగా మారిన వారిని, వీధి బాలలు, బాల కార్మికులు, డ్రాపౌట్లు, వేధింపులు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చుతారు.
ఐదేళ్లలో 479 మందికి విముక్తి
చిన్నారులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే మొదట సదరు యజమానికి, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. మార్పు రాకుంటే కేసులు నమోదు చేస్తారు. బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం, బడుల్లో చేర్పించడం, అనాథలైతే.. చైల్డ్ హోంలో చేర్పించడం, ఇతర రాష్ట్రాల వారుంటే అక్కడి సిబ్బందితో మాట్లాడి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడం, బాల్య వివాహాలు ఆపడం వంటివి చేస్తుంటారు. ఐదేళ్లల్లో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు నిర్వహించగా 479మంది బాల కార్మికులు, ఇతరులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఏడాది ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్
2021 244 45
2022 58 31
2023 17 07
2024 19 25
2025 33 ముస్కాన్ ప్రారంభమైంది
ఈనెల 31వరకు కార్యక్రమం
ఈనెల అఖరు వరకు జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ము స్కాన్ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రతి ఏడాది ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి బాల కార్మికులను గుర్తిస్తున్నాం. పట్టుబడిన బాలలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, వారి తల్లిదండ్రులకు అప్పగించడం, పనిలో పె ట్టుకునే యాజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
– సరస్వతి,
జిల్లా సంక్షేమ అధికారి, కరీంనగర్

‘చిరు’సాయం భవితకు నవోదయం