
భూములకు భద్రత
● త్వరలో రంగంలోకి లైసెన్స్‌డ్ సర్వేయర్లు ● రెండు, మూడు రోజుల్లో జీపీవోల నియామకం
కరీంనగర్ అర్బన్: పట్టా, ప్రభుత్వ భూములకు భద్రతతో పాటు హద్దుల బెంగ త్వరలోనే తీరనుంది. భూ రికార్డుల పారదర్శకతతో పాటు పర్యవేక్షణ పక్కాగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణనిస్తుండగా గ్రామ పాలన అధికారుల నియామకానికి శరవేగంగా కసరత్తు జరుగుతోంది. మొత్తంగా భూములను వివాదరహితంగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం రెండు రకాల చర్యలు చేపట్టేలా భూ భారతి చట్టంలో మార్గనిర్దేశం చేసింది. మొదట క్రయ విక్రయాలకు సర్వే మ్యాప్‌ను తప్పనిసరి చేయనుండగా తదుపరి శాశ్వత భూధార్ నంబర్లు జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
త్వరలో జీపీవోల నియామకం
గ్రామ పాలన అధికారులను నియమించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆప్షన్లు తీసుకుని పరీక్షలు నిర్వహించగా పక్షం రోజుల క్రితం ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 191 మంది పరీక్షకు హాజరవగా 163 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 318 గ్రామ పంచాయతీలుండగా 163 మందిని నియమిస్తే మిగతా 155మందిని ఎవరిని నియమిస్తారన్నది తెలియడం లేదు. కాగా జీపీవోల నియామకం ప్రక్రియ ఈ నెల 4వరకు పూర్తవనుందని పక్కా సమాచారం. భూ భారతిలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించగా వేల సంఖ్యలో అర్జీలు రాగా వాటి పరిష్కారంలో జీపీవోల సహకారముంటేనే నిర్ణీత సమయంలోగా పూర్తవనుంది.
పక్షం రోజుల్లో లైసెన్స్‌డ్ సర్వేయర్లు
లైసెన్స్‌డ్ సర్వేయర్లను జూన్ 27నుంచి శిక్షణ ప్రక్రియ మొదలైంది. 50 రోజుల శిక్షణలో భాగంగా రెండు బ్యాచ్‌లుగా జిల్లాకేంద్రంలో శిక్షణనిస్తున్నారు. సాగు, ప్రభుత్వ భూములకు హద్దుల గొడవ ఉండకుండా ఉండాలనే సదుద్దేశంతో లైసెన్స్‌డ్ సర్వేయర్లను తెరపైకి తెచ్చారు. 300మందికి శిక్షణనిస్తుండగా జిల్లాలో 318 గ్రామాలున్నాయి. ప్రభుత్వ సర్వేయర్లు 20మంది ఉండగా భూ కొలతలకు ఇబ్బంది ఉండదిక. భూవివాదాల శాశ్వత పరిష్కారానికి రిజిస్ట్రేషన్ల సమయంలో భూనక్షా(పటం) సమర్పించాలనే నిబంధన త్వరలోనే అమలవనుంది.
సర్వేతోనే భూధార్
భూ భారతిలో ప్రస్తావించిన ప్రతి రైతుకూ భూ ధార్ నంబరు ఇచ్చే ప్రక్రియను అమలు చేయనున్నారు. చట్టం ప్రకారం మొదట ప్రతి రైతు రికార్డులు పరిశీలించి.. సరిగ్గా ఉన్నాయని భావి స్తే టెంపరరీ భూధార్ నంబరు ఇవ్వనుండగా ఆ తర్వాత సరిహద్దులను గుర్తించి మ్యాప్ గీయనున్నారు. సర్వేయర్ అప్రూవ్ చేస్తే తహశీల్దార్ అమలు చేస్తారు. అప్పుడు అది సరిహద్దుల్లేని భూమి గా గుర్తించబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే పర్మినెంట్ భూదార్ నంబరు ఇవ్వాలని ఆర్వోఆర్–2025 స్పష్టం చేస్తోంది. ఈ రెవెన్యూ రికార్డు ల వెరిఫికేషన్ జీపీవోలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో నే పూర్తవుతుంది. కానీ, రెండో ప్రక్రియ మాత్రం లైసెన్సుడ్ సర్వేయర్లు, సర్వేయర్లు, తహసీల్దార్ల విధుల్లో భాగం. రికార్డుల వెరిఫికేషన్ కోసం జీపీవోలు కూడా పని చేయాల్సి ఉంటుంది.
భూ రికార్డుల నవీకరణలో తేలిన గణాంకాలు
సాగు విస్తీర్ణం: 3,33,450 ఎకరాలు
వ్యవసాయేతర భూమి: 33,007ఎకరాలు
ప్రభుత్వ భూమి: 40,366
వక్ఫ్ భూములు: 517 ఎకరాలు
అటవీ భూములు: 1,748 ఎకరాలు
ఖాతాల సంఖ్య: 1,92,687
మొత్తం సర్వేనంబర్లు: 3,51,545
జిల్లాలో గ్రామాలు: 318
రెవెన్యూ గ్రామాలు: 205
జీపీవో పరీక్షలో ఉత్తీర్ణులైనవారు: 163
శిక్షణ పొందుతున్న లైసెన్స్‌డ్
సర్వేయర్లు: 300