తెలంగాణలో స్కిల్‌ సర్వే ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తెలంగాణలో స్కిల్‌ సర్వే ప్రారంభం

May 21 2025 12:15 AM | Updated on May 21 2025 12:15 AM

తెలంగాణలో స్కిల్‌ సర్వే ప్రారంభం

తెలంగాణలో స్కిల్‌ సర్వే ప్రారంభం

నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

రామగిరి(మంథని): తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని, జూన్‌ తొలివారంలో స్కిల్‌ సర్వే ప్రారంభమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలో సింగరేణి ఆర్జీ–3 జీఎం సుధాకర్‌రావు అధ్యక్షతన మంగళవారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పైలెట్‌ ప్రాజెక్టులుగా సీఎం నియోజకవర్గం కొడంగల్‌, మంథని నియోజకవర్గాలను ఎంపిక చేశారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే 57వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. నైపుణ్యం ఉన్నవారికి కచ్చితంగా ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిండం కోసం సింగరేణి సీఎండీతో మాట్లాడి సెంటినరీకాలనీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కళాశాలగా అభివృద్ధి చేసి ఇక్కడే నుంచే నియామకాలు చేపట్టేలా కృషి చేయాలని సూచించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, ఏపీఏ, ఆర్జీ–1, హెచ్‌ఆర్డీ జీఎంలు నాగేశ్వరరావు, లలిత్‌ కుమార్‌, గుంజపడుగు రఘుపతి, మంథని ఆర్డీవో సురేశ్‌, పర్సనల్‌ విభాగాధిపతి సుదర్శనం, అధికారి శ్రీహరి, ప్రతినిధులు రాజ్‌కుమార్‌, రాంచంద్రారెడ్డి, కోట రవీందర్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

జూన్‌ తొలివారంలో పోలీసుస్టేషన్లు ప్రారంభం

సాక్షి పెద్దపల్లి: వచ్చే జూన్‌ తొలివారంలో జిల్లాలోని నాలుగు పోలీస్‌స్టేషన్లు ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాళేశ్వరంలో ఏనాడూ లేనివిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. కాశీ మాదిరిగా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఏర్పాట్లు బాగోలేవని ఎంపీ బండి సంజయ్‌ విమర్శించడం సరికాదని అన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల కోసం ఎంపీలు కిషన్‌రెడ్డి, సంజయ్‌ కేంద్రప్రభుత్వం నుంచి రూ.వెయ్యి కోట్లు తీసుకురావాలని, అంతర్గాంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం కేంద్రమంత్రిని కలిసివినతి పత్రం ఇచ్చామన్నారు. విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మిస్‌ వరల్డ్‌ పోటీలతో డబ్బులు వృథా చేస్తున్నామని వాట్సప్‌ యూనివర్సిటీలో విషప్రచారం చేస్తున్నారని, పోటీల ద్వారా తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకే నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో కోకాకోలా ఫ్యాక్టరీ నిర్మాణానికి ఓ కంపెనీ ముందుకు వచ్చిందన్నారు. ఎంపీ వంశీకృష్ణతో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. రాష్ట్రపతికి ఎవరైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, కానీ దానికి వ్యాలిడిటీ ఉండాలన్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌ బైపాస్‌లు టెండర్‌ దశకు వచ్చాయని, పత్తిపాక రిజర్వాయర్‌కు డీపీఆర్‌ సిద్ధమవుతోందని తెలిపారు. రామగుండంలో థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement