
అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం
● భద్రాచలం శ్రీసీతారాముల ఆలయం నుంచి పట్టువస్త్రాలు ● స్వామివారికి సమర్పించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
● అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ● తరలివస్తున్న హనుమాన్ దీక్షాపరులు
మల్యాల: కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి పెద్ద జయంతి ఉత్సవాలు మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే వేలాదిమంది మంది కొండగట్టుకు చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిపోయాయి. శ్రీదేవి, భూదేవి, శ్రీవేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్థానాచార్యులు కపీందర్, ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, రామకృష్ణ, రఘు, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులను యాగశాలలో ప్రవేశింపజేశారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర ఆలయం నుంచి ఆలయ ఈఓ ఎల్.రమాదేవి పట్టువస్త్రాలు తీసుకురాగా.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, అర్చకులు ఒగ్గుడోలు చప్పుళ్లు, శ్రీరాముడు, సీతాదేవి, హనుమానంతుని వేషధారణలతో భక్తులు, మహిళల కోలాటం, మంగళహారతులతో స్థానిక వైజంక్షన్ నుంచి ఆలయం వరకు శోభాయాత్ర చేపట్టి స్వామివారికి సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది కొండగట్టుకు తరలిరానున్నారని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లు చేపట్టారని అన్నారు. పెద్ద జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
కొండగట్టులో పటిష్ట భద్రత
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా కొండగట్టులో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. జెఎన్టీయూలో పోలీస్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఉత్సవాలకు 800మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరూ క్షేమంగా తిరిగి వెళ్లేలా పనిచేయాలన్నారు. వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రాములు, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ అరిఫ్ అలీఖాన్, సీఐలు నీలం రవి, రాంనరసింహారెడ్డి పాల్గొన్నారు.

అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం

అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం

అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం

అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం