
ఆపరేషన్ చేయకుండా జాప్యం
● 16 గంటలపాటు ఇబ్బందుల్లో మహిళా పేషెంట్
కోల్‌సిటీ(రామగుండం): పేషెంట్లు, వారి బంధువులతో గౌరవంగా ఉండాలని, విసుక్కోకుండా ఓపిగ్గా సమాధానాలు చెబుతూ.. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని సేవలపై నమ్మకం కలిగించేలా వ్యవహరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచనలు చేస్తున్నా.. ఆశించిన రీతిలో మార్పు కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. మంగళవారం ఓ పేషెంట్‌పై ఆస్పత్రి సిబ్బంది వహించిన నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్ సోదరి కుమారుడు గణేశ్ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలానికి చెందిన చిటికెల సత్తక్క ఈనెల15న ఇంట్లో జారిపడింది. మరుసటి రోజున గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని అడ్మిట్ చేసుకున్నారు. మంగళవారం ఆపరేషన్ చేస్తామని చెప్పిన వైద్యులు, సిబ్బంది.. సోమవారం సత్తక్కకు ఎనిమా ఇచ్చి, యూరిన్ పైప్ వేశారు. ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు ఎలాంటి ఆహారం తీసుకోవద్దని చెప్పారు. దీంతో మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఆహారం తీసుకోలేని సత్తక్కకు, ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో తెలుసుకోవడానికి గణేశ్ సిబ్బందిని అడిగాడు. ఆపరేషన్ చేస్తామని మీకు ఎవరు చెప్పారు? పేషెంట్‌కు ఆపరేషన్ లేదు? అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. కంగుతిన్న పేషెంట్ బంధువులు, మేం అడిగేంత వరకు ఆపరేషన్ చెయ్యమని చెప్పకుండా, పేషెంట్ ఏమీ తినకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే, నీరసించిపోయి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని నిలదీశారు. ఈమేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాల్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందన రాకపోవడంతో గణేశ్ మీడియాకు తెలియజేస్తానని నేరుగా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌కు వచ్చాడు. ప్రెస్‌క్లబబ్ మూసి ఉండడంతో తిరిగి ఆస్పత్రికి వెళ్లిన గణేశ్.. డ్యూటీ డాక్టర్ రేణుకు ఫిర్యాదు చేశాడు. స్పందించి ఆర్‌ఎంవో రేణుక.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మరో ఆర్‌ఎంవో రాజును వివరణ కోరగా, సాధారణంగా ఆపరేషన్ల నిర్వహణకు అనుకున్న వారి కంటే ఒకరిద్దరు పేషెంట్లను ఎక్కువగా సిద్ధంగా ఉంచుతామని, ఎంపిక చేసిన వారిలో ఎవరికై నా బీపీ తదితర అనారోగ్య సమస్యలు అకస్మాత్తుగా పెరిగితే వారికి ఆపరేషన్ చేయకుండా వాయిదా వేసి, మిగితా వారికి ఆపరేషన్లు నిర్వహిస్తామని వివరించారు. సత్తక్క పేషెంట్‌ను కూడా ఇదే తరహాలో సిద్ధం చేసినట్లు తెలిపారు. కానీ కమ్యూనికేషన్ లోపంతో ఇలా జరిగి ఉండొచ్చని, ఇందులో పేషెంట్‌కు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు.