
నేతన్నలకు నిరంతర ఉపాధి
● వస్త్రపరిశ్రమకు రూ.736.88 కోట్ల ఆర్డర్లు
● నాణ్యమైన వస్త్రాల ఉత్పత్తిని అలవాటు చేస్తున్నాం
● మార్కెట్‌తో పోటీ పడితేనే పరిశ్రమకు మనుగడ
● ‘సాక్షి’తో టెస్కో జనరల్ మేనేజర్ వి.అశోక్‌రావు
వి.అశోక్‌రావు, టెస్కో జనరల్
మేనేజర్,
హైదరాబాద్
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేత కార్మికులకు ఉపాధి లభించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇస్తుందని రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య (టెస్కో) జనరల్ మేనేజర్ వి.అశోక్‌రావు అన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) కోర్సులపై అవగాహన కల్పించేందుకు మంగళవారం సిరిసిల్లకు వచ్చారు. ఈ సందర్భంగా ఇందిర మహిళా శక్తి చీరల ఉత్పత్తి, స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల ఆర్డర్లు, నేతన్నల సంక్షేమ పథకాల అమలుపై ‘సాక్షి’కి వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
● కొత్త రకం వస్త్రాల ఉత్పత్తి
సిరిసిల్లలో దశాబ్దాలుగా చేస్తున్న వస్త్రాల ఉత్పత్తికి భిన్నంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లను ఇచ్చింది. ఇక్కడ సహజంగా 80–90 కౌంట్ యారన్(నూలు) వాడుతూ వస్త్రాలను ఉత్పత్తి చేస్తారు. కానీ, ఇప్పుడు చీరల బట్టను ట్విస్టేడ్ 50 కౌంట్ ధారం(యారన్)తో పవర్‌లూమ్స్‌పై ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కొత్త రకం వస్త్రాలు చాలా స్మూత్‌గా ఉంటాయి. ఈ వస్త్రాన్ని ప్రభుత్వానికే కాకుండా బయట బహిరంగ మార్కెట్‌లోనూ విక్రయించేంత నాణ్యంగా ఉంటాయి. ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉన్నా.. కొత్త రకం వస్త్రాల ఉత్పత్తులను నేతన్నలకు అలవాటు చేస్తున్నాం. ఇప్పటికే మూడు వేల మగ్గాలపై 10 లక్షల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల బట్ట ఉత్పత్తి అయింది. మగ్గాల మధ్య శ్రమించే కార్మికులకు మీటరుకు రూ.5.25 కూలి చెల్లించాలని స్పష్టం చేశాం.
● ఒక్క చీరకే 4.24 కోట్ల మీటర్ల ఆర్డర్లు
ప్రస్తుతం రెండు విడతల్లో 2.12 కోట్ల మీటర్ల చొప్పున 4.24 కోట్ల మీటర్ల చీరల వస్త్రాల ఆర్డర్లు ఇచ్చాం. ఈ వస్త్రం విలువ రూ.318.44 కోట్లు ఉంటుంది. వస్త్రానికి అవసరమైన నూలు(ధారం)ను ప్రభుత్వమే కొనుగోలు చేసింది. సొంతంగా వస్త్రోత్పత్తి చేసే ఆసాములకు చెందిన 49 మ్యాక్స్ సంఘాలకు 577 మెట్రిక్ టన్నుల నూలు అందించాం. ఇంకా గోదాములో 28 టన్నుల నూలు అందుబాటులో ఉంది. మహిళా శక్తి చీరల ఉత్పత్తికి 1,002 మెట్రిక్ టన్నుల నూలు అవసరమని అంచనా వేసి ఆర్డర్లు ఇచ్చాం. వస్త్రోత్పత్తిని బట్టి నూలు అందిస్తాం. ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి కూడా కూలి సర్దుబాటులో భాగంగా 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం.
● 9 గజాల గోచీ చీరల బట్టకు ఇతర ప్రాంతాల్లో ఆర్డర్లు
కొందరు మహిళలు 9 గజాల పొడువున్న గోచీ చీరలు కట్టుకుంటారు. వారి కోసం గర్షకుర్తి, బోయినపల్లి, ఉప్పరమల్యాల ప్రాంతాల్లోని వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు ఇచ్చాం. 3.50 లక్షల మీటర్ల 9 గజాల కాటన్ చీరల ఉత్పత్తి సాగుతుంది. సిరిసిల్లలో పవర్‌లూమ్స్ (సాంచాలకు), ఇతర ప్రాంతాల్లో కాటన్ చీరల ఆర్డర్లు ఇచ్చాం. చీరల బట్టనే సేకరించి హైదరాబాద్‌లోనే ప్రింటింగ్ చేయించి ఈ ఏడాదిలో ఒక్కో చీరను మహిళా సంఘాల సభ్యులకు అందిస్తాం.
● రెండో విడత కొత్త డిజైన్లు ఇస్తాం
మొదటి విడత ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి 64 లక్షల చీరలు అవసరం ఉన్నాయి. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చాం. రెండో విడత కొత్త రకం డిజైన్లు ఆర్డర్లు ఇస్తాం. వాటి ఆర్డర్లు కూడా సిరిసిల్లతో పాటు ఇతర ప్రాంతాల వారికి ఇస్తాం. మొత్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ల ఖరీదు రూ.636.88 కోట్లు ఉంటుంది. ఇవి కాకుండా స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్లు కోటి 25 లక్షల మీటర్లు, వెల్ఫేర్ శాఖలకు సంబంధించి మరో 50 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చాం. వీటి విలువ రూ.వంద కోట్ల మేర ఉంటుంది. మొత్తంగా ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రూ.736.88 కోట్ల మేరకు ఉంటాయి.
● స్కూళ్లు తెరిచే నాటికి డ్రెస్ సిద్ధం
ఇప్పటికే రాజీవ్ విద్యా మిషన్‌లో స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల ఉత్పత్తి చివరి దశకు చేరింది. కొన్ని స్టిచ్చింగ్ దశలో ఉన్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఒక్కో విద్యార్థికి డ్రెస్ సిద్ధం అవుతంది. సంక్షేమ శాఖల వస్త్రాల ఉత్పత్తి, సేకరణ సాగుతుంది. గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి వస్త్రాలను టెండర్ ద్వారా కొనుగోలు చేసి అందించే వారు. తెలంగాణ వచ్చిన తర్వాత స్థానిక నేతన్నలకు పని కల్పించే లక్ష్యంతో వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తుంది.
● దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాల అమలు
దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. పవర్‌లూమ్, అనుబంధ రంగాల కార్మికులు, చేనేత (హ్యాండ్‌లూమ్) కార్మికులకు పొదుపు అలవాటు చేసేందుకు త్రిఫ్ట్ పథకాన్ని అమలు చేస్తుంది. పవర్‌లూమ్ కార్మికులు నెలకు గరిష్టంగా రూ.1,200 పొదుపు చేస్తే, ప్రభుత్వం అంతే మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. రెండేళ్ల తర్వాత వడ్డీతో సహా దాదాపు రూ.65 వేలు పొందవచ్చు. అదే చేనేత కార్మికులు రూ.1,200 పొదుపు చేస్తే ప్రభుత్వం రూ.2,400 జమ చేస్తుంది. అంటే ప్రతి నెలా రూ.3,600 కార్మికుడి ఖాతాలో జమవుతాయి. రెండేళ్ల తర్వాత రూ.లక్ష వరకు వస్తాయి. నేత, పవర్‌లూమ్ కార్మికులు వృత్తిలో ఉండి ఏ విధంగా చనిపోయినా.. నేతన్న బీమా పథకంలో రూ.5లక్షల ఆర్థిక సాయం అందుతుంది. నేతన్నలు పొదుపు అలవాటు చేసుకుని, వృత్తిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యం పెంచుకుని, నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయాలి. ఆ దిశగా అడుగులు వేస్తేనే పరిశ్రమకు మనుగడ ఉంటుంది.

నేతన్నలకు నిరంతర ఉపాధి