
బదిలీలకు పచ్చజెండా
● ప్యాక్స్ సీఈవోలతో పాటు స్టాఫ్ అసిస్టెంట్లకు బదిలీ ● ఏళ్లుగా తిష్టవేసిన వారికి స్థానచలనం ● ఫెవికాల్ బంధం వీడేనా..?
కరీంనగర్ అర్బన్:
ఏళ్ల తరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నవారికి బదిలీలు తప్పవిక. సహకారశాఖలో కొందరు దశాబ్దాలుగా ఒకే ప్రాంతంలో పని చేస్తుండగా వారితో పాటు స్టాఫ్ అసిస్టెంట్లకు బదిలీ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన జీవో నంబర్ 44 జారీ చేసింది. అన్ని శాఖల్లో రెండేళ్లకోసారి బదిలీలు జరుగుతుండగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లో మాత్రం కొన్నేళ్లుగా బదిలీలు లేవు. దీంతో కొందరు సీఈవోలు దశాబ్దాల తరబడి సొసైటీల్లో ఉండి సదరు సొసైటీలను దెబ్బతీయడమే గాక రైతుల పేర్లతో రుణాలను నొక్కేశారు. ఈ విషయంలో ఉమ్మడి జిల్లాలో పలువురు సస్పెండ్ అయిన విష యం తెలిసిందే. సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్లను లెక్కచేయకుండా పెత్తనం చెలాయిస్తూ తలనొప్పిగా మారిన సీఈవోలు అంతా కూడబలుక్కుని స్వాహా చేసినవారున్నారు. ఈ క్రమంలో బదిలీలు జరగనుండగా సొసైటీలు గాడినపడే అవకాశముంది.
దశాబ్దాలుగా పాతుకుపోయారు
ఉమ్మడి జిల్లాలో 128 పీఏసీఎస్‌లు ఉన్నాయి. చాలా సొసైటీల్లో 20 ఏళ్లకుపైగా సీఈవోలు తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పలు చోట్ల సీఈవోలే షాడోగా వ్యవహరిస్తూ చైర్మన్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రతీ సొసైటీకి చైర్మన్ ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సీఈవోలు మాత్రం ఉద్యోగ విరమణ చేసేంత వరకు తమను ఏమీ చేయలేరనే ఆలోచనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల సీఈవోలతో పాటు స్టాఫ్ అసిస్టెంట్ల బదిలీకి నిర్ణయించింది. మూడు నుంచి ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన వారిని వెంటనే బదిలీ చేయాల్సి ఉండగా ప్రభుత్వం జీవో జారీచేసింది.
ఎస్‌ఎల్‌ఈసీ మార్గదర్శకాల మేరకు
పీఏసీఎస్‌లలో సీఈవోల బదిలీలను టెస్కాబ్ పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టెస్కాబ్ అధికారులు డీసీసీబీ, సొసైటీల్లో బదిలీల ప్రక్రియపై దృష్టి సారించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం 128 సొసైటీలకు చెందిన సీఈవో లను, స్టాఫ్ అసిస్టెంట్‌లను ఎక్కడి నుంచి ఎక్కడికై నా బదిలీ చేసే వీలుంది. కొన్ని నెలల క్రితం సొసైటీల పాలకవర్గాలు సీఈవోలను తొలగించాలని తీర్మానాలు చేసి డీసీఈవోలతో పాటు డీసీసీబీ సీఈవోకు, టెస్కాబ్‌కు సైతం వాటిని పంపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశాల మేరకు అధికారుల బదిలీలకు జీవో 44ను జారీ చేశారు.
త్వరలో డీఎల్‌ఈఎస్ సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం సీఈవోలను, స్టాఫ్ అసిస్టెంట్‌లను బదిలీ చేయడానికి నిర్ణయించి జీవో జారీ చేయడంతో ఎస్‌ఎల్‌ఈసీ సమావేశం నేడో, రేపో జరగనుంది. ఎస్‌ఎల్‌ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో డీఎల్‌ఈసీ సమావేశాన్ని ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తారు. ఈ కమిటీలో డీసీసీబీ చైర్మన్‌తో పాటు డీసీసీబీ సీఈవో, డీసీవో, నాబార్డు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు ఉంటారు. వాస్తవానికి ఈ కమిటీ ఎప్పటికప్పుడూ సొసైటీల్లో చైర్మన్లు, సీఈవోలకు ఇబ్బందులు వచ్చినప్పుడు సమన్వయపర్చడం, అవసరమైతే సీఈవోను బదిలీ చేయడం వంటివి చేయాలి. ఏళ్లుగా సీఈవోల బదిలీల విషయంలో టెస్కాబ్ నిర్ణయం తీసుకోకపోవడం, డీఎల్‌ఈఎస్ సమావేశాలు నిర్వహించకపోవడంతో ఇంతకాలం సీఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
ఉమ్మడి జిల్లా వివరాలు
ప్రాథమిక సహకార సంఘాలు: 128
సహకార కేంద్ర బ్యాంకు శాఖలు: 67
బ్యాంకు ఉద్యోగులు: 552
సొసైటీ ఉద్యోగులు: 1700