
సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ
కరీంనగర్ కార్పొరేషన్: దేశంలో సాంకేతిక విప్లవానికి పునాదివేసింది మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ అని డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. డీసీసీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. రాజీవ్‌చౌక్‌లో ఉన్న విగ్రహస్థానంలో సుడానిధులతో ఏర్పాటు చేయనున్న కాంస్య విగ్రహానికి నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ శంకుస్థాపన చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ 30ఏళ్ల క్రితం నగేశ్ ముదిరాజ్ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారని, ఆ స్థానంలో కొత్తగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, అర్బన్ బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, చాడగొండ బుచ్చిరెడ్డి, ఆకుల నర్సయ్య, పులి ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.
శిక్ష పడేలా పని చేయాలి
కరీంనగర్‌క్రైం: మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు శిక్షపడేలా కృషి చేయాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. బాధితులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి, సక్రమంగా నిర్వహించాలని సూచించారు. లైంగిక వేధింపులకు గురైనవారిని పోలీస్‌స్టేషన్లు, ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతా వరణంలో చేయూతనివ్వడానికి భరోసా కేంద్రం ఏర్పాటైందన్నారు. భరోసా కేంద్రాల ద్వారా లైంగిక వేధింపుల కేసుల్లో శిక్షలశాతం పెరిగిందని వివరించారు. ఏసీపీ మాధవి, సీఐ శ్రీలత, ఎస్సై అనూష పాల్గొన్నారు.
జిల్లా జడ్జితో భేటీ
జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎస్.శివకుమార్‌ను బుధవారం సీపీ గౌస్‌ఆలం మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 14వ తేదీన జరగనున్న లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న రాజీ పడే కేసులను పరిష్కరించాలని కోరారు. లోక్ అదాలత్ సన్నద్ధతలో భాగంగా కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్ ఆధ్వర్యంలో కమిషనరేట్‌లోని పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తులు డి.ప్రీతి, బి.రాజేశ్వర్, ఏసీపీ వెంకటస్వామి పాల్గొన్నారు.
పెండింగ్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం
కరీంనగర్ అర్బన్: ఉద్యోగుల అపరిష్కృత సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశముందని ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ తహసీల్దార్లుగా బాధ్యతలు చేపట్టిన ఈ.నరేందర్, ఎన్.రాజేశ్‌ను ఆయా కార్యాలయాల్లో ఉద్యోగసంఘాల నేతలు బుధవారం కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగుల అపరిష్కృత సమస్యలకు త్వరలోనే పరిష్కా రం లభించనుందని వివరించారు. సమస్యల సాధన కోసం నియమించిన కమిటీకి రాష్ట్ర జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీని వాసరావు నివేదించారని వివరించారు. జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్ గౌడ్, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మిందర్‌సింగ్, లవకుమార్, రాజేశ్ భరద్వాజ్ పాల్గొన్నారు.
ఉచిత సైకాలజీ కోర్సులు
కరీంనగర్: కరీంనగర్ చైతనా సైకాలజికల్ లెర్నింగ్ సెంటర్ ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఉచిత సైకాలజీ ఆన్‌లైన్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ కౌన్సెలింగ్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, కెరియర్ కౌన్సెలింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి గ్రాడ్యుయేషన్ లేదా పీజీ సైకాలజీ ఉన్నవారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చున్నారు. వివరాలకు 97039 35321 నంబర్‌ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ