
ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందే
కరీంనగర్‌స్పోర్ట్స్: ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన సంజయ్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పెహల్గాం ఘటన అనంతరం దేశ ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్ధంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. మొన్నటి పాకిస్తాన్ కుట్ర సమయంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ సైన్యానికి మద్దతుగా నిలవడం దేశభక్తికి నిదర్శనమన్నారు. యాంటీ టెర్రరిజం డే ర్యాలీని నిర్వహించేందుకు క్రికెట్ సంఘం, క్రీడాకారులు ముందుకు రావడం సంతోషంగా ఉందని అభినందించారు. జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, ఎన్.మురళీధర్‌రావు, సంయుక్త కార్యదర్శి పి.మనోహర్‌రావు, బండి శ్రవణ్‌కుమార్, బి.రామేశ్వర్‌రావు పాల్గొన్నారు.
● యాంటీ టెర్రరిజం డే ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్