
ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసిన అధికారులు
చైనీస్ సైబర్ కేఫ్‌లకు వందలాది మంది భారతీయుల విక్రయం
తెలంగాణ కంటే ముందే అదుపులోకి తీసుకున్న గుజరాత్
బండి సంజయ్ చొరవతో తెలంగాణకు అప్పగింత
మానవ అక్రమ రవాణాపై గతంలో ‘సాక్షి’ వరుస కథనాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాల్లో కొలువుల పేరిట వందలాది మంది భారతీయులను విదేశాల్లోని చైనా సైబర్ కేఫ్‌లకు విక్రయించిన మానవ అక్రమ రవాణా డాన్ హితేశ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. భారత విదేశాంగ శాఖ కోరిక మేరకు అతడిని మంగళవారం రాత్రి థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులు ఇండియాకు డిపోర్ట్ చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన హితేశ్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, విదేశాంగశాఖకు అప్పగించారు.
మార్చిలో కరీంనగర్ పోలీసులు జారీచేసిన లుక్‌అవుట్ నోటీసుల ఫలితంగా హితేశ్ ఇండియా రాగానే అదుపులోకి తీసుకున్నారు. హితేశ్ ఇండియాకు వస్తున్నాడన్న సమాచారంతో మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, గుజరాత్‌కు చెందిన హితేశ్‌ను తెలంగాణ పోలీసుల కంటే ముందే ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రోజంతా జరిగిన హైడ్రామా తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలుగజేసుకోవటంతో ఎట్టకేలకు హితేశ్‌ను తెలంగాణ పోలీసులకు అప్పగించారు. దీంతో కరీంనగర్ పోలీసులు అతన్ని సాయంత్రానికి కరీంనగర్‌కు తరలించారు.
దేశవ్యాప్త నెట్‌వర్క్
గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు చెందిన హితేశ్ మానవ అక్రమ రవాణా సూత్రధారి. ఇతను థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ దేశాల్లో సైబర్ నేరాలకు పాల్పడే కేఫ్‌లకు మనుషులను అక్రమంగా పంపిస్తాడు. విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని, నెలకు రూ.లక్ష జీతమని నమ్మబలికి ఒక్కో వ్యక్తిని 3,000 డాలర్లకు చైనీస్ సైబర్ కేఫ్‌లకు విక్రయించేవాడు. మనదేశంలో ఇతనికి ప్రతి రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నారు. ఇప్పటివరకు అతడు దాదాపు 300 మందికిపైగా భారతీయులను విక్రయించాడని సమాచారం.
ఇతని ఏజెంట్లలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామారావు రాజశేఖర్ ఒకడు. వీరిద్దరు కలిసి గతేడాది డిసెంబర్‌లో కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మధుకర్‌రెడ్డి అనే యువకుడిని మయన్మార్‌కు పంపారు. అక్కడ ఆ యువకుడు తిరగబడ్డాడు. ఈ విషయాన్ని ‘సాక్షి’వరుస కథనాలతో వెలికితీయడంతో స్పందించిన బండి సంజయ్.. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. దీంతో తొలుత అక్కడ సైబర్‌కేఫ్‌లో చిక్కుకున్న 540 మందిని మయన్మార్ సైన్యం సాయంతో కాపాడారు.
తెలంగాణ సైబర్ పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానకొండూరు, ఖానాపూర్‌లో హితేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనే కరీంనగర్ పోలీసులు హితేశ్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీచేశారు. మరో కీలక నిందితుడు రాజశేఖర్ లావోస్‌లో తలదాచుకుంటున్నాడని సమాచారం. భారతీయ యువతీ యువకులను చైనీయులకు విక్రయించిన హితేశ్.. వారు తిరగబడితే చిత్రహింసలు పెట్టి చీకటిగదుల్లో వేయించేవాడు. చైనీయుల కోసం వందల మంది భారతీయులను అంగడి సరుకుగా విక్రయించాడు. చివరికి ఆ చైనీయులే అతన్ని చితకబాది థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులకు పట్టించడం కొసమెరుపు.