రంగస్థలం రమేశ్‌ | - | Sakshi
Sakshi News home page

రంగస్థలం రమేశ్‌

Jan 29 2024 1:40 AM | Updated on Jan 29 2024 1:40 AM

చీకటిపువ్వు నాటికలోని సన్నివేశం 
 - Sakshi

చీకటిపువ్వు నాటికలోని సన్నివేశం

కరీంనగర్‌కల్చరల్‌: ఆయన దర్శకత్వం వహించిన నాటకాలు మద్యపాన నిషేధం ఆవశ్యకతను తెలియజేస్తాయి.. చదువు గొప్పతాన్ని చాటి చెబుతాయి.. కార్మికుల కష్టాన్ని కళ్లకు కడతాయి.. సమాజంలోని వివిధ అంశాలను తీసుకొని దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నారు మంచాల రమేశ్‌. 1970 ఆగస్టు 22న రామచంద్రం–కనకలక్ష్మి దంపతులకు వంగరలో జన్మించారు. 1980లో ‘బడి పంతులు’ నాటకం ద్వారా బాలనటుడిగా రంగస్థల నట ప్రస్థానం ప్రారంభించారు. కరీంనగర్‌లోని విద్యుత్‌శాఖ సర్కిల్‌ ఆఫీస్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూ, ప్రవృతిగా నాటకరంగాన్ని ఎంచుకొని తెలుగు రాష్ట్రాల్లో వివిధ వేదికలపై నాటికలను ప్రదర్శిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. చైతన్య కళాభారతి నాటక సమాజం కార్యదర్శిగా కొనసాగుతూ ప్రస్తుతం కరీంనగర్‌లోని శివాజీనగర్‌లో నివసిస్తున్నారు.

ప్రదర్శించిన నాటకాలు

బడిపంతులు, సంసారంలో సరాగాలు, ప్రేమగోల, చదవరా నాటిక ద్వారా ప్రభుత్వం నిర్వహించిన అక్షర ఉజ్వల కార్యక్రమంలో జిల్లా అంతటా 250 ప్రదర్శనలు ఇచ్చారు. డీఆర్‌డీఏ తరుఫున బంగారుగుడ్లు నాటికను జిల్లా వ్యాప్తంగా 32 సార్లు ప్రదర్శించారు. సారయ్య కాపురం ద్వారా ప్రభుత్వం నిర్వహించిన సారా నిషేధం కార్యక్రమంలో తనవంతు పాత్ర పోషించారు. గృహనిర్మాణ సంస్థ తరుఫున ‘నాకు ఇల్లాచ్చింది’ నాటికను 24 చోట్ల ప్రదర్శించారు. మనిషి, దేవతరూపం, ఈతరం మారాలి, పామరులు, నిరసన, ఆకలివేట, కాలచక్రం, విధాత, ప్రేమ పిచ్చోళ్లు, ఇతిహాసం, క్షతగాత్రుడు, ఆశాపాళం, మార్గదర్శి, ఎవరో ఒకరు నాటకాలలో నటించారు. తన సొంత ఖర్చులతో క్లిక్‌, లాలలీల, ప్రేమ ఈక్వల్‌ టూ, చెల్లనిపైసలు, దొంగలు, ఈ లెక్క ఇంతే, ఖరీదైన జైళ్లు, చీకటిపువ్వు, స్వప్పం రాల్చిన అమృతం నాటికలకు దర్వకత్వం వహించి నటించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వందలాది ప్రదర్శనలతో ఎన్నో బహుమతులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా, ఉత్తమ సహాయ నటుడిగా, హాస్య నటుడిగా, విలన్‌గా తన విలక్షణ నటనతో అందిరి ఆకట్టుకుంటున్నాడు.

నటుడు, దర్శకుడిగా..

● 2002లో హైదరాబాద్‌లో రాజేంద్రప్రసాద్‌ దర్శత్వం వహించిన సన్మతి నాటకంలో నటుడిగా పాల్గొన్నారు.

● 2006లో నిజామాబాద్‌లో ‘ప్రేమ ఈక్వల్‌ టూ’ నాటికకు దర్శకత్వం వహించారు.

● 2010లో నంద్యాలలో జరిగిన నాటకోత్సవాల్లో స్వీయ దర్శకత్వంలో ‘చెల్లని పైసలు’ నాటకానికి కరీంనగర్‌ జిల్లా చరిత్రలో మొదటి ఉత్తమ కాంస్య నంది అవార్డు వరించింది.

● 2015లో కర్నూలులో ‘ఈ లెక్క ఇంతే’, 2016లో రాజమండ్రిలో ‘మా ప్రేమకు న్యాయం కావాలి’, 2023లో గుంటూరులో ‘చీకటి పువ్వు’ నాటకానికి ఉత్తమ కాంస్య నంది అవార్డు అందుకున్నారు.

సన్మానాలు.. సత్కారాలు

● 1996లో ఫోక్‌ ఆర్ట్స్‌ అకాడమి కరీంనగర్‌ వారిచే గ్రామీణ కళాజ్యోతి అవార్డు.

● 1999లో తుమ్మల రంగస్థల పురస్కారం, రసరమ్య కళారంజని, నల్గొండ వారిచే సన్మానం.

● 2011లో కళాజగతి నాటకరంగ పత్రికవారిచే సత్కారం.

● 2014లో విశాఖపట్టణంలో కళాశ్రేష్ట బిరుదు ప్రదానం. మానవత కల్చరల్‌ అకాడమీ వారిచే సత్కారం.

● 2017లో వల్లం నాగేశ్వర్‌రావు రంగస్థల పురస్కారం.

● 2023లో వైకే నాగేశ్వరరావు రంగస్థల పురస్కారం. పాలకుర్తిలో సోమనాథ రంగస్థల పురస్కారం అందకున్నారు.

● విద్యుత్‌శాఖ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల్లో ఇప్పటివరకు వరుసగా పదిసార్లు బహుమతులు వరించాయి.

వృత్తి విద్యుత్‌ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌.. ప్రవృత్తి నాటక రంగం

నటుడు.. దర్శకుడిగా రాణింపు

వరించిన అవార్డులు, సత్కారాలు, ప్రశంసలు

గురువులకు రుణపడి ఉంటా

ఇన్నేళ్లు నా నట జీవితంలో ఎన్నో అవార్డులు, సన్మానాలు, సత్కారాలు, ప్రశంసలు, పేరు ప్రఖ్యాతలు రావడానికి కారకులు నా గురువులు. శ్రీరాముల సత్యనారాయణ, బండారి దేవరాజ్‌లకు ఎప్పటికీ రుణపడి ఉంటా.

– మంచాల రమేశ్‌, దర్శకుడు,

రంగస్థల నటుడు

ఖరీదైన జైళ్లు నాటికకు ఉత్తమ బహుమతి  అందుకుంటున్న రమేశ్‌ (ఫైల్‌)1
1/1

ఖరీదైన జైళ్లు నాటికకు ఉత్తమ బహుమతి అందుకుంటున్న రమేశ్‌ (ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement