
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ జీవన్‌రెడ్డి
ఇల్లందకుంట(హుజూరాబాద్): మద్యానికి బానిసయ్యారు. చేతుల్లో డబ్బు లేకపోవడంతో దొంగలుగా మారారు. వైన్స్‌లే లక్ష్యంగా కన్నం వేశారు. మద్యం బాటిళ్లు, డబ్బులు దొంగలించారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లారు. జమ్మికుంట మండలంలోని రెండు వైన్స్‌లు, ఇల్లందకుంటలోని రెండువైన్స్‌ల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఇల్లందకుంట పోలీసుస్టేషన్‌లో గురువారం ఏసీపీ జీవన్‌రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏసీపీ వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన తోడేటి ఓంసాయి, బండారి అరవింద్ జల్సాలకు అలవాటుపడి మద్యానికి బానిసయ్యారు. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఈ నెల 8న జమ్మికుంట మండలం నాగంపేట వైన్స్‌లో రూ.5వేలు, 14న కొత్తపల్లి సిరివైన్స్‌లో రూ.7వేలు, ఇల్లందకుంటలోని సాయినాథ్ వైన్స్‌లో రూ.26వేలు, మారుతీ వైన్స్‌లో రూ.55వేలు మొత్తం రూ.93వేల నగదు, ఐదు మద్యం సీసాలు, ఒకబైక్ దొంగతనం చేశారు. వైన్స్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీ, టెక్నాలజీ వినియోగించి దొంగలను పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్సై రాజ్‌కుమార్, రైటర్ అనిల్, కానిస్టేబుల్ పాషా పాల్గొన్నారు.
ఇద్దరు అంతర్‌జిల్లా దొంగల అరెస్టు
రూ.93వేల నగదు.. మద్యం బాటిళ్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఏసీపీ జీవన్‌రెడ్డి