● వ్యాధుల నియంత్రణకు ఎప్పటికప్పుడు చర్యలు ● వారంలో రెండు రోజులు డ్రై డే
కరీంనగర్‌రూరల్: వానాకాలంలో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను చేపట్టారు. ముందస్తు పారిశుధ్య పనులు చేపట్టడం ద్వారా వ్యాధులను దూరం చేయొచ్చనే ఉద్దేశంతో ఈనెల 22 నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారంలో రెండు రోజులు డ్రైడేలు పాటించాలని పంచాయతీ కార్యదర్శులకు డీపీవో జగదీశ్వర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేక పారిశుధ్య పనులు...
జిల్లాలోని మొత్తం 318 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో కలుషిత తాగునీటితో అతిసార ,కలరా, టైపాయిడ్, మలేరియా, మెదడువాపు, డెంగీ, చికెన్‌గున్యా తదితర వ్యాధులు ప్రబలే అవకాశముండటంతో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లోని ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మురికికాలువలను ఎప్పటికపుడు శుభ్రం చేయడంతోపాటు నీళ్లు నిల్వ ఉండాకుండా చర్యలు చేపట్టాలి. నివాస గృహాలు, రోడ్ల పక్కన ఉన్న చెత్తాచెదారాన్ని సేకరించి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలించాలి. మరికి కాలువలు, గుంతల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. దోమల నియంత్రణకు ఆయిల్‌బాల్స్ వేయాలి. వారానికి రెండు పర్యాయాలు ఫాగింగ్ చేయాలి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు తొలగించాలి. తాగునీటి పైపులైన్ల లీకేజీలకు ఎప్పటికపుడు మరమ్మతు చేయించాలి. చేతిపంపులు, పబ్లిక్‌నల్లాల వద్ద నీళ్లు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి.
గ్రామస్తులకు అవగాహన...
వానాకాలంలో వచ్చే వ్యాధులపై వైద్యసిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలి. గ్రామ, మండల స్థాయిలో వ్యాధినియంత్రణ చర్యలపై సమావేశాలను నిర్వహించాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి. ఇండ్లల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి బ్లీచింగ్ ఫౌడర్ చల్లుకోవాలని సూచించాలి. కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని, దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలి. ఇంట్లోకి దోమలు రాకుండా జాలీలను ఏర్పాటు చేసుకోవాలి.