
మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్
● తల్లిదండ్రుల కల నెరవేర్చి.. రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలి ● జిల్లాస్థాయి స్పోర్ట్స్‌మీట్‌లో మంత్రి గంగుల కమలాకర్
తిమ్మాపూర్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్‌లోని మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి స్పోర్ట్స్‌మీట్‌ను గురువారం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి ప్రారంభించారు. మంత్రి గంగుల మాట్లాడుతూ కేజీ నుంచి పీజీవరకు విద్యను ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 19పాఠశాలలు ఉంటే.. స్వరాష్ట్రంలో కేసీఆర్ 337 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పటికే ఉన్న కళాశాలతో పాటు మరో 33 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ తాము చదువుకునే రోజుల్లో ఎటువంటి వసతులు లేవని, చదువు ఉన్నతవర్గాల వారికే పరిమితం అనే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కలెక్టర్ గోపి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఎంజేపీ స్కూల్స్ డిప్యూటీ కమిషనర్ తిరుపతి, ఎంపీపీ కేతిరెడ్డి వనిత, ప్రిన్సిపాల్ విమల, సర్పంచులు శ్రీవాణి, నీలమ్మ, రమేశ్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్‌బాపూజీ కలలు నిజం చేద్దాం
కరీంనగర్: తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన కొండా లక్ష్మణ్‌బాపూజీ కన్న కలలను నిజం చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ 11వ వర్ధంతి సందర్భంగా బైపాస్‌వద్ద ఉన్న బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు మెతుకు సత్యం, వాసాల రమేశ్, ఇప్పనపల్లి సాంబయ్య, గడ్డం వెంకటేశం, రవీందర్, మునీందర్ పాల్గొన్నారు.