Telangana Ambedkar Overseas Vidya Nidhi Scheme: Eligible Countries And Criteria, Required Documents - Sakshi
Sakshi News home page

విద్యానిధి అందుకో.. విదేశాల్లో చదువుకో, రూ.20లక్షల వరకు రుణ సదుపాయం

Mar 17 2023 6:50 AM | Updated on Mar 17 2023 1:55 PM

- - Sakshi

కరీంనగర్‌: డిగ్రీ తరువాత విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని ఆసక్తి ఉండి, ఆర్థికంగా వెనకబడిన నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలవారికి విదేశీ విద్యానిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. రూ.20లక్షల రుణాన్ని రెండువిడతల్లో అందించి వారి అభివృద్ధికి తోడ్పాటునిస్తోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి, మైనారిటీలకు ముఖ్యమంత్రి ఓవర్సీస్‌ విద్యానిధి, బీసీలకు మహాత్మా జ్యోతిబాఫులే విద్యానిధి పథకాలు భరోసానిస్తున్నాయి. 2014–15 ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీలకు, 2015–16నుంచి మైనార్టీల కు, 2018నుంచి బీసీలకు ఈ పథకాలు అమలు చేస్తున్నారు. అవగాహన లేకపోవడంతో ఈ పథకాల ద్వారా విదేశాలకు వెళ్లి చదివింది కొందరే.

చేయూతనిస్తున్నా... అంతంతే...
విదేశీవిద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటుంది కొందరే. అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ప్రారంభమై ఎనిమిదేళ్లయినా ఇప్పటివరకు విదేశాలకు వెళ్లింది ఏడుగురే. ముఖ్యమంత్రి ఓవర్సీస్‌ పథకం ద్వారా 18మంది, మహాత్మా జ్యోతిబాఫులే విద్యానిధి పథకానికి జిల్లానుంచి 12మంది ఎంపికై నట్లు సమాచారం. ప్రభుత్వం విద్యానిధి పథకాలతో విదేశీవిద్యను ప్రోత్సహిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఇది అందరికీ దక్కడం లేదు. జిల్లాలో 1500పైగా ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మెడికల్‌ కళాశాలలు ఉన్నాయి. విద్యాసంవత్సరం ముగిసేదశలో సంక్షేమశాఖల పరిధిలోని అధికారులు, కళాశాలల యాజమాన్యం విదేశీవిద్యపై అవగాహన కల్పిస్తే చాలా మంది విదేశాల్లో చదువుకునేందుకు ఆసక్తి కనబరిచే అవకాశముంది.

పది దేశాల్లోనే పథకం అమలు..
ఈ పథకం ద్వారా చదివేందుకు మనం దేశం నుంచి పదిదేశాలకే అనుమతిస్తున్నారు. ఇందులో దక్షిణ కొరియా, అమెరికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, న్యూజిలాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌ దేశాల్లో మాత్రమే ఉన్నతవిద్యను అభ్యసించాల్సి ఉంటుంది. ఇక్కడ వైద్య ,విద్య, ఇంజినీరింగ్‌, మేనేజ్మెంట్‌, ప్యూర్‌సైన్స్‌, వ్యవసాయం, సోషల్‌ సైన్సెస్‌, హ్యూమానిటీస్‌, తదితర కోర్సుల్లో పీజీ చేయడానికి అవకాశం ఉంటుంది.

అర్హతలు ఇలా...
► ఇంజినీరింగ్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, వ్యవసాయం, నర్సింగ్‌, సామాజిక శాస్త్ర కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

► ఈ కోర్సుల్లో 60శాతానికి పైగా మార్కులు సాధించాలి.

► టోఫెల్‌లో 60శాతం. ఐఈఎల్టీటీఎస్‌ 80మార్కులు, జీఆర్‌ఈ, జీమ్యాట్‌లో ఉత్తీర్ణత సాధించి పీఈటీలో 50శాతం అర్హత మార్కులు ఉన్నవారికి అవకాశం.

► విద్యార్థుల వయసు 35 ఏళ్లలోపు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉండాలి.

దరఖాస్తుకు అవసరమయ్యే ధ్రువపత్రాలు ఇవీ..
కులం, ఆదాయం, జనన ధ్రువీకరణపత్రాలు, ఆధార్‌ కార్డు, పదో తరగతి, డిగ్రీ, ఇంటర్‌, పీజీ మార్కుల జాబితాలతోపాటు టోఫెల్‌, ఐఈఎల్‌, టీఎసీఆర్తోస్‌ఈ, జీమ్యాట్‌, పీఈటీ అర్హత కలిగి ఉండాలి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయడానికి సంబంధిత కళాశాల ప్రవేశ అనుమతిపత్రం, ప్రవేశ రుసుం చెల్లించిన రశీదు, బ్యాంకు ఖాతా పుస్తకాలు, వీటి ఆధారంగా మీసేవా కేంద్రంలో గానీ, ఆన్‌లైన్‌లో తెలంగాణ ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ.10 విలువైన నాన్‌ జ్యూడిషియల్‌ స్టాంపును అతికించి రిజిస్ట్రార్‌ సంతకంతో కూడిన పత్రాన్ని ఆదాయ ధ్రువపత్రానికి జత చేసి దరఖాస్తు సమర్పించాలి. ఆయా సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శుల నేతత్వంలోని కమిటీ సభ్యులు దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. గడువు అంటూ ఉండదు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement