కామారెడ్డి టౌన్ : జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులైన ఎల్.మల్లికార్జున్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఈవో కార్యాలయంలో సెక్టోరల్ అధికారులు, కోఆర్డినేటర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు.
పాత డీఈవోకు వీడ్కోలు..
జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసి బదిలీపై హైదరాబాద్ కార్యాలయానికి వెళ్తున్న ఎస్.రాజును కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సన్మానించారు. అలాగే డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించి సాదరంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భిక్కనూరు: కూతురును సర్కారు బడిలో చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ సర్పంచ్. వివరాలిలా ఉన్నాయి. కాచాపూర్ సర్పంచ్ జ్యోతి సంతోష్‌గౌడ్ కూతురు లక్ష్మీప్రసన్న ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. బడిబాటలో భాగంగా ఇంటింటికి వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని చెబుతున్న సర్పంచ్.. ముందుగా తన కూతురును గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతిలో చేర్పించారు. ఆమెను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సుభాన్‌రెడ్డి, ఉపసర్పంచ్ దశరథం పాల్గొన్నారు.
● ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ
సంయుక్త కార్యదర్శి అనిల్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో కొనసాగుతున్న ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులలో సీట్ల సంఖ్యను 30 నుంచి 60కి పెంచాలని తెయూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంయుక్త కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో తెయూ వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరం నుంచే ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశాలను 60 కి పెంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ ప్రాంత వనవాసి కన్వీనర్ అశోక్, కార్యకర్తలు సంజీవ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.


