కేంద్రీయ విద్యాలయం ప్రారంభమయ్యేనా..? | - | Sakshi
Sakshi News home page

కేంద్రీయ విద్యాలయం ప్రారంభమయ్యేనా..?

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

కేంద్రీయ విద్యాలయం ప్రారంభమయ్యేనా..? విద్యారంగ అభివృద్ధికి ఆస్కారం

ఏడేళ్ల క్రితమే మంజూరు

నేటికీ పూర్తికాని ప్రక్రియ

ఎంపీ, ఎమ్మెల్యేలపైనే ఆశలు

మద్నూర్‌(జుక్కల్‌): జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గం జుక్కల్‌. ఇది ఎవరూ కాదనలేని నిజం. చీకటిలో చిరుదివ్వెలా జిల్లాలో కేవలం మద్నూర్‌ మండలానికి కేంద్రీయ విద్యాలయం(కేవీ) 2019లో మంజూరైంది. నేటికి పనులు మొదలు కాకపోవడంతో మద్నూర్‌కు మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఉంటుందా లేక తరలిపోతుందా అనే అనుమానం కలుగుతోంది. 2019 నుంచి నేటి వరకు కేంద్రీయ విద్యాలయం ఎప్పుడు ప్రారంభం అవుతుందోనని ప్రజలు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాల సంస్థ సూచనల మేరకు అధికారులు మండల కేంద్రంలో తాత్కాలిక భవనాలను కూడా ఎంపిక చేశారు. భవన నిర్మాణం కోసం మండల కేంద్రంలో 5 ఎకరాల స్థలాన్ని కూడా సిద్ధం చేశారు. మండల రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు సైతం అందించారు. కేంద్రీయ విద్యాలయం అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించారు. అయినా ఇంత వరకు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై స్పష్టత రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు చింతిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీ కమిషనర్‌ మంజునాథ్‌, డీఈవో రాజులతో సమావేశమై మండల కేంద్రంలోని భవన నిర్మాణం కోసం స్థలాన్ని చూపించారు. అలాగే స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించుకోవచ్చని కేంద్రీయ అధికారులకు ఎమ్మెల్యే వివరించారు. కాని ఇంత వరకు కేంద్రీయ విద్యాలయంపై కదలిక లేకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2022లో రిలే నిరాహార దీక్ష

మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని 2022లో మద్నూర్‌ ప్రజలంతా ఏకమై తహసీల్‌ కార్యాలయ ఆవరణలో 5 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మద్నూర్‌లో కేంద్రీయ విద్యాలయం నెలకొల్పడానికి అప్పటి ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్న బీబీ పాటిల్‌, హన్మంత్‌సింధేలు ప్రత్యేక చొరవ తీసుకుంటామని రిలే నిరాహార దీక్ష విరమించాలని కోరడంతో ఐదు రోజులుగా నిర్వహించిన నిరాహార దీక్షను విరమించారు. ఆ తర్వాత యువకులు కేంద్రీయ విద్యాలయంపై పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సైతం అందజేశారు. కాని నేటికీ కేంద్రీయ విద్యాలయ నిర్మాణంపై, తాత్కాలిక తరగతుల ప్రారంభంపై ఎలాంటి సమాచారం లేదు.

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలతో పాటు పేద విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయంలో సీట్లు కేటాయిస్తారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటైతే ఎంతో మందికి విద్యావకాశాలు మెరుగుపడతాయి. తద్వార విద్యారంగం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికై నా ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావులు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం మొదలుపెట్టి తాత్కాలిక కేంద్రీయ విద్యాలయం ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement