కుప్పలు ‘తిప్పలు’గా.. | - | Sakshi
Sakshi News home page

కుప్పలు ‘తిప్పలు’గా..

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

కుప్పలు ‘తిప్పలు’గా..

లారీలు రాక కేంద్రాల్లోనే

మూలుగుతున్న ధాన్యం బస్తాలు

పక్షం రోజులుగా కుప్పల వద్దే పడిగాపులు

ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు.. పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికీ కష్టపడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాలలో తూకాలు సాగక, కాంటా అయినా లారీలు రాక ఇబ్బందులు పడుతున్నారు.

రెండుమూడు వారాలుగా కుప్పల వద్దే పడిగాపులు పడాల్సి వస్తోంది. త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

కామారెడ్డి క్రైం: జిల్లాలో యాసంగి సీజన్‌లో దాదాపు 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగయ్యింది. ప్రధానంగా గాంధారి, లింగంపేట, సదాశివనగర్‌, తాడ్వాయి, రాజంపేట, భిక్కనూరు, బిచ్కుంద, ఎల్లారెడ్డి మండలాల పరిధిలో మక్క ఎక్కువగా సాగు చేశారు. గతేడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఈసారి యాసంగిలో మొక్కజొన్న సాగుపై రైతులు ఆసక్తి కనబరిచారు. అయితే ఈసారి చాలా ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

వేధిస్తున్న లారీల కొరత..

జిల్లాలో మూడు వారాల క్రితం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గాంధారిలో కేంద్రం ప్రారంభం అయిననాటి నుంచి ఇప్పటివరకు 5 లారీలు మాత్రమే వచ్చాయి. ఇప్పటికీ కేంద్రంలో దాదాపు 5 వేల బస్తాలు కాంటా అయి ఉన్నాయి. వాటిని తరలించడానికి లారీలు రాకపోవడంతో మధ్యలో కొన్ని రోజులు కాంటా నిలిపివేయాల్సి వచ్చింది. ఉత్తునూర్‌లో కూడా దాదాపు 2 వేల బస్తాలను తరలించాల్సి ఉంది. ఇలా జిల్లావ్యాప్తంగా సమస్య ఉంది. ఖరీఫ్‌ దగ్గరపడుతున్న సమయంలో సాగుకు సన్నద్ధం కావాల్సిన సమయంలో రోజంతా కొనుగోలు కేంద్రం వద్దే గడపాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కడ అకాల వర్షం కురుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, త్వరగా మక్కలను గోదాములకు తరలించాలని కోరుతున్నారు. లారీల కొరత విషయమై మార్క్‌ఫెడ్‌ అధికారులను ఫోన్‌ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించగా.. వారు స్పందించడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement