కామారెడ్డి టౌన్ : ప్రజా పాలనతోనే రాష్ట్ర ప్రగతి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్‌లో జిల్లా స్థాయి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామాల్లోని సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించేందుకు ’ప్రజా పాలన’ ఒక అద్భుత వేదికగా నిలుస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు చెరువులు, వాగుల్లోనుంచి మొరం, ఇసుక తెచ్చుకునేటప్పుడు పోలీసులు, అధికారులు కేసులు పెడితే సహించేది లేదన్నారు. రెండేళ్లలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి లేకపోతే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి అధికారులు అంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే జి ల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. జిల్లా ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకునేలా చూసి, జూన్ 2న గృహ ప్రవేశాలు చేయిస్తామని పేర్కొన్నారు. రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్ వరకు త్వరలోనే ఉదయం అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నామన్నారు. జిల్లా అధికారులు ఆయా శాఖల పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల తీరును పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ గిరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి, తహసీల్దార్ హిమబిందు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధి,
రైతుల శ్రేయస్సే లక్ష్యం
ప్రభుత్వ సలహాదారులు
షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి
99 రోజుల కార్యాచరణ
జిల్లా స్థాయి సమావేశం


