వచ్చేనెల 5 లోపు వడ్లు, మక్కల కొనుగోళ్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేవీఆర్‌ | - | Sakshi
Sakshi News home page

వచ్చేనెల 5 లోపు వడ్లు, మక్కల కొనుగోళ్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేవీఆర్‌

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

వచ్చేనెల 5 లోపు వడ్లు, మక్కల కొనుగోళ్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేవీఆర్‌

కామారెడ్డి టౌన్‌ : వర్షాకాలం సమీపిస్తున్నందున జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు, తరలింపు ప్రక్రియలను వచ్చేనెల 5వ తేదీలోపు పూర్తి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని హాల్‌లో వరి, మక్క కొనుగోళ్లపై మున్సిపల్‌, మార్కెటింగ్‌, సివిల్‌ సప్లయ్‌ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు, రైస్‌ మిల్లుల వద్ద తగిన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేయాలని, తూకం, రవాణా, అన్‌లోడింగ్‌ ప్రక్రియల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. వర్ష సూచనలు ఉన్నందున కేంద్రాల్లోని వరి నిల్వలు తడవకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి రైస్‌ మిల్లు రోజూ కనీసం 12 వాహనాల ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటివరకు 70 వేల మెట్రిక్‌ టన్నుల వడ్లు కొనుగోలు చేయగా, అందులో 65 వేల మెట్రిక్‌ టన్నులను మిల్లులకు తరలించామన్నారు. మరో 25 వేల మెట్రిక్‌ టన్నుల వడ్లు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 1,471 మెట్రిక్‌ టన్నుల మక్కలు కొనుగోలు చేయగా, అందులో 1,231 మెట్రిక్‌ టన్నులను గోదాములకు తరలించామన్నారు. మిగిలిన మక్కలు, వడ్లను త్వరగా తరలించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ విక్టర్‌, ఆయా శాఖల అధికారులు, రైస్‌ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement