తరలని ధాన్యం.. సాగని తూకం.. | - | Sakshi
Sakshi News home page

తరలని ధాన్యం.. సాగని తూకం..

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

దోమకొండ: కొనుగోళ్లు వేగంగా సాగకపోవడంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో సరిపడా హామాలీలు లేకపోవడంతో కాంటాలు వేగంగా సాగడం లేదు. మరోవైపు తూకం వేసిన బస్తాలను తరలించడానికి లారీలు రావడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాలలో బస్తాలు పేరుకుపోతున్నాయి. దాదాపు మూడు వారాలుగా కాంటాకోసం, ధాన్యం తరలింపు కోసం ఎదురుచూస్తున్నామని పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతేడాది దోమకొండలోని సింగిల్‌విండో కార్యాలయ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రోజుకు ఎనిమిది లారీల చొప్పున వచ్చేవని, ప్రస్తుతం రోజుకు రెండు లారీలే వస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గత మూడు నాలుగు రోజుల నుంచి లారీల రాక పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. దోమకొండలోనే దాదాపు 3 వేల బస్తాలు కాంటా పూర్తై తరలించడానికి సిద్ధంగా ఉన్నాయని, లారీలు రాకపోవడంతో ఇబ్బందిపడుతున్నామని పేర్కొంటున్నారు. దోమకొండ సొసైటీ పరిధిలోని లింగుపల్లి, సంఘమేశ్వర్‌, మాందాపూర్‌, అంచనూరు గ్రామాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. లారీల కొరత ఉన్న మాట వాస్తవమేనని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకాంత్‌ పేర్కొన్నారు. త్వరలో రవాణా సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ధాన్యం తరలించడం కోసం మరో 40 రైస్‌మిల్లులతో మాట్లాడామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement