‘ప్రజా సంక్షేమంపై దృష్టి’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజా సంక్షేమంపై దృష్టి’

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

భాగ్యరెడ్డి వర్మ జయంతి రెడ్‌క్రాస్‌ సొసైటీ మహారాజ పోషక సభ్యత్వం అందజేత

మద్నూర్‌(జుక్కల్‌): అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. డోంగ్లీ మండలంలోని మదన్‌హిప్పర్గాలో శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్‌తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామస్తుల కోసం ఫార్మేషన్‌ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మహిళ సంఘాల అభివృద్ధికి దోహదపడే విధంగా నూతనంగా నిర్మించనున్న ఎస్‌హెచ్‌జీ భవనానికి భూమిపూజ చేశారు. గ్రామంలో నిర్మించిన పంచాయతీ నూతన భవనాన్ని కూడా వారు ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో మాట్లాడి అవసరం ఉన్న మేర నిధులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు గజానంద్‌దేశాయ్‌, నాయకులు, కార్యకర్తలున్నారు.

కామారెడ్డి క్రైం: సామాజిక సంస్కర్త, దళిత ఉద్యమ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పూలమాలలు వేసి వివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని అన్నారు. అదనపు కలెక్టర్‌ విక్టర్‌, ఎస్సీ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కర్మకాండకు వచ్చి వెళ్తూ..

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకుల మృతి

బైక్‌ డివైడర్‌ను ఢీకొనడంతో ఘటన

మృతులు మహారాష్ట్రవాసులు

మద్నూర్‌(జుక్కల్‌): బంధువు మృతి చెందడంతో కర్మకాండ కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందిన ఘటన మద్నూర్‌ సమీపంలోని జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్డుపై శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని దెగ్లూర్‌ తాలూకలోని షాపూర్‌కి చెందిన తల్లీకొడుకులు గాండ్లవార్‌ పండరి(48), గాండ్లవార్‌ శేషాబాయి(65) బైక్‌పై మద్నూర్‌ మండలంలోని మేనూర్‌లో బంధు వు కర్మకాండకు వచ్చారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు సర్వీస్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో శేషాబాయి అక్కడికక్కడే మృతి చెందగా, పండరిని మహారాష్ట్రలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ విషయమై ఎస్సై మోహన్‌రెడ్డిని వివరణ కోరగా రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారని, ఫిర్యాదు అందలేదని తెలిపారు.

కామారెడ్డి అర్బన్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా సభ్యత్వ నమోదులో భాగంగా శుక్రవారం రోటరీ క్లబ్‌ అసిస్టెంట్‌ గవర్నర్‌ ముస్కు జైపాల్‌రెడ్డి మహారాజ పోషకులుగా సభ్యత్వం తీసుకున్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ ఎం.రాజన్న చేస్తున్న సామాజిక సేవ కృషికి సహకారంగా తాను మహారాజ పోషకులుగా సభ్యత్వం స్వీకరించినట్టు జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రెడ్‌క్రాస్‌ వైస్‌ చైర్మన్‌ నాగరాజుగౌడ్‌, జిల్లా కార్మిక శాఖ అధికారి శశికుమార్‌, ప్రతినిధులు రమణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, భాస్కర్‌, దత్తాద్రి, ప్రవీణ్‌రెడ్డి, రిషికుమార పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement