ప్రభుత్వ ఆస్పత్రిలో నిలిచిన కు.ని. ఆపరేషన్లు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిలో నిలిచిన కు.ని. ఆపరేషన్లు

Apr 30 2026 8:07 AM | Updated on Apr 30 2026 8:07 AM

ప్రభుత్వ ఆస్పత్రిలో నిలిచిన కు.ని. ఆపరేషన్లు

మహారాష్ట్రకు వెళ్తున్న ప్రజలు

ఏళ్లుగా శిబిరాలు నిర్వహించని

అధికారులు

ప్రైవేటు ఆస్పత్రులను

ఆశ్రయించాల్సిన పరిస్థితి

బిచ్కుంద: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. బిచ్కుంద మండలంలోని పుల్కల్‌లో పీహెచ్‌సీ, బిచ్కుందలో వంద పడకల ఆస్పత్రి ఉన్నాయి. అయితే బిచ్కుంద ఆస్పత్రి పేరుకే పెద్దాస్పత్రి. ఇక్కడ ఏళ్లుగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరగడం లేదు. ఎనిమిదేళ్ల క్రితం వంద పడకల ఆస్పత్రి భవనం నిర్మించినా అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో సర్కారు విఫలం కావడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదు.

గతంలో ఏటా రెండు మూడు క్యాంప్‌లు..

బిచ్కుందలో పదేళ్ల క్రితం వరకు ఏటా రెండుమూడుసార్లు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాలు నిర్వహించేవారు. బిచ్కుంద మండల ప్రజలతోపాటు జుక్కల్‌, మద్నూర్‌, పెద్దకొడప్‌గల్‌, పిట్లం తదితర మండలాల ప్రజలు ఇక్కడికి వచ్చి కు.ని. ఆపరేషన్లు చేయించుకునేవారు. అప్పట్లో ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నందుకు ప్రోత్సాహకంగా వెయ్యి రూపాయలు అందించేది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితి మారిపోయింది. బిచ్కుందలో కు.ని. ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో గైనకాలజిస్టు, సర్జన్‌ లేకపోవడం, సిబ్బంది కొరత, ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్య పరికరాలు లేకపోవడం వల్ల ఆపరేషన్లు జరగడం లేదని తెలుస్తోంది. దీంతో కు.ని. ఆపరేషన్లు జరగడం లేదు.

బిచ్కుంద ఆస్పత్రిలో కు.ని. ఆపరేషన్‌ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు పక్కనే ఉన్న మహారాష్ట్రలోని దెగ్లూర్‌లోగల ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం రూ. 25 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆపరేషన్‌ చేయించుకున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా కు.ని. ఆపరేషన్లు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement