● మంత్రి సీతక్కకు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ వినతి
నిజామాబాద్ రూరల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈమేరకు వారు బుధవారం నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్ వద్ద మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికీ సగం ధాన్యం కల్లాల్లోనే ఉందని వాటిని, పట్టిచుకునే నాథులే కురువయ్యారని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. మిగిలిన 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో, రోడ్ల మీద ఎండకు ఎండుతోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,000 కొనుగోలు కేంద్రాలు తెరిచామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో 2,800 కూడా సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైస్ మిల్లర్లతో ఉన్న సమస్యలను పరిష్కరించి, తేమ, బరువు, తగ్గుదల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలన్నారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


