ప్రత్యామ్నాయం చూస్తున్నాం
జిల్లాలో రైస్‌మిల్ పరిశ్రమ కుదేలవుతోంది. ఓవైపు సీఎంఆర్ అందించనందుకు ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుండగా.. మరోవైపు సార్టెక్స్ అప్‌గ్రేడ్ నిబంధనతో మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు. మిల్లులను అప్‌గ్రేడ్ చేసుకోవడం ఆర్థికంగా భారం కావడంతో జిల్లాలో నాలుగోవంతు మిల్లులు మూతపడ్డాయి. – ఎల్లారెడ్డి
జిల్లాలో రెండేళ్ల క్రితం వరకు చిన్న, పెద్ద రైస్‌మిల్లులు కలిపి 165 ఉండేవి. సార్టెక్స్ యంత్రాలు లేని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించొద్దని సర్కారు గతంలో నిబంధన విధించింది. యంత్రాలను అప్‌గ్రేడ్ చేయడం ఆర్థికంగా భారం కావడంతో జిల్లాలో మిల్లులు మూతపడుతున్నాయి. ఇప్పటికే 45 రైస్ మిల్లులు మూతపడ్డాయి. ప్రస్తుతం 120 మిల్లులు నడుస్తున్నాయి. మూతబడిన 45 రైస్ మిల్లులలో 25 ఇప్పటివరకు సీఎంఆర్ బకాయిలు ఉన్నాయి. దీంతో ఆయా మిల్లులపై అధికారులు కేసులు పెట్టారు. ఇంకా సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లులపై కేసులు పెట్టబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేసులు నమోదైన మిల్లులకు యాసంగికి సంబంధించిన ధాన్యం కేటాయించే అవకాశాలు లేవు. అదే విధంగా సార్టెక్స్ టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయని మిల్లులకు సైతం ఈసారి ధాన్యం కేటాయించడం లేదు.
సేకరించిన ధాన్యం కేటాయింపులెలా?
జిల్లాలో యాసంగి సీజన్‌లో 5.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో రైతుల ఇంటి అవసరాలకు పోను 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. అయితే వచ్చే ధాన్యం ఎక్కువగా ఉండగా.. పాతిక శాతం మిల్లులు మూత పడడం, సీఎంఆర్ కేసులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్లారెడ్డి ప్రాంతంలో గతంలో 18 రైస్ మిల్లులు ఉండగా.. ఈ సీజన్‌కు వచ్చేసరికి ఆరు మిల్లులే మిగిలాయి. గతంలో 18 రైస్ మిల్లులకు పంపిన ధాన్యాన్ని ఇప్పుడు ఆరింటికే సర్దాల్సి ఉంటుంది. ఇది అధికారులకు తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి.
కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం చేరవేయడానికి జాప్యం జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. రైస్ మిల్లులలో ఉన్న రెండు సీజన్ల ధాన్యాన్ని తరలించేందుకు ప్రభుత్వ గోదాములతో పాటు ప్రైవేట్ గోదాములను కూడా తీసుకుంటున్నాం. మూత బడిన రైస్ మిల్లులను కూడా గోదాములుగా వాడుకోవాలని చూస్తున్నాం. రైతులు, మిల్లర్లు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
– విక్టర్, అదనపు కలెక్టర్
సార్టెక్స్ అనేది బియ్యం గింజలను వాటి పరిమాణం ప్రకారం ఫిల్టర్ చేయడానికి, క్రమబద్ధీకరించడానికి ఉపయోగించే యంత్రం. దీని ద్వారా బియ్యం గింజలు వాటి రంగు, ఆకారం, పరిమాణం ప్రకారం వేరు చేయబడతాయి. ఈ ప్రక్రియలో నాణ్యత లేని, లోప భూయిష్టమైన ధాన్యం వేరై నాణ్యమైన, శుభ్రమైన బియ్యం మిగులుతాయి. ధాన్యంలోని రాళ్లు, మట్టి, నాణ్యత లేని ధాన్యం వేరై, మేలు రకం బియ్యం మాత్రమే బయటకు వస్తాయన్న మాట. ప్రభుత్వం దాదాపు రెండేళ్ల క్రితం సార్టెక్స్ నిబంధన తీసుకువచ్చింది. దీని ప్రకారం పాత కాలపు బిన్నీ రైస్ మిల్లులను సార్టెక్స్ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేయడానికి ప్రతి రైస్ మిల్లుకు రూ. 50 లక్షలపైనే వ్యయమవుతుంది. ఇది చాలా మిల్లులకు ఆర్థిక భారంగా మారింది. దీంతో ఆర్థిక భారాన్ని మోయలేని స్థితిలో ఉన్నవారు మిల్లులను మూసి వేశారు.
ఓవైపు సీఎంఆర్ కేసులు..
మరోవైపు సార్టెక్స్ నిబంధన
జిల్లాలో 45 రైస్ మిల్లుల మూసివేత
ధాన్యం సేకరణకు అడ్డంకిగా
మారనున్న మిల్లుల కొరత


